Reading Time: 3 minutes
Will Global Oil Surplus Reduce Petrol Prices In India Explained

కొన్ని వారాల క్రితం… ప్రపంచం ఒక మహా వినాశనపు అంచున నిలబడింది. ఇరాన్ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. గ్లోబల్ ట్రేడ్ లైఫ్ లైన్‌గా పేరొందిన హోర్ముజ్ జలసంధి మూతపడుతుందనే భయాందోళనలు ప్రపంచాన్ని వణికించాయి. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లను దాటి… ఏకంగా 200 డాలర్లను తాకుతుందన్న విశ్లేషకుల హెచ్చరికలు దేశాల ఆర్థిక మూలాలను కదిలించాయి. ఎనర్జీ క్రైసిస్ ముంగిట భారత్ లాంటి దేశాలు ఊపిరి బిగబట్టాయి. కానీ, సీన్ కట్ చేస్తే… అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అంతర్జాతీయ చమురు మార్కెట్ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది! యుద్ధ భయాల నుంచి ఇప్పుడు ‘ఆయిల్ సర్ప్లస్’ వైపు మార్కెట్ పరుగు తీస్తోంది. మరి, ఈ పరిణామాలు భారతీయ సామాన్యుడి జేబును కాపాడతాయా? పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

IEA అంచనాలు ఏం చెబుతున్నాయి?

కొంతకాలంగా హార్మూజ్ జలసంధి చుట్టూ చమురు రాజకీయం నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఈ జలసంధి గుండా సాగే ఆయిల్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ-IEA అంచనాల ప్రకారం, ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియా నుంచి రోజుకు 14 మిలియన్ బారెళ్ల చమురు మార్కెట్లోకి రాకుండా ఆగిపోయింది. రోజూ సగటున 20 మిలియన్ బారెళ్ల చమురు హార్మూజ్ గుండా రవాణా అయ్యేది. అలాంటిది మే నాటికి 9.6 మిలియన్ బారెళ్లకు పడిపోయింది. ఈ సరఫరా కొరతే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలను 120 డాలర్ల స్థాయికి నెట్టేసింది. అయితే, దౌత్య వ్యూహాలు ఫలించి, అమెరికా-ఇరాన్ మధ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదరింది. దీంతో, సోమవారం నాటికి చమురు ధరలు మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ‘షిప్-టు-షిప్’ బదిలీల సాయంతో రవాణా తిరిగి 12 మిలియన్ బారెళ్లకు చేరుకుని రికవరీ బాట పట్టింది.

ఆయిల్ ధరలు 120 డాలర్ల వద్దే ఆగిపోవడం వెనుక ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా ఆడిన వ్యూహాత్మక మైండ్ గేమ్ ఉంది. విశ్లేషకులు భయపడినట్లు ధరలు 200 డాలర్లకు చేరకపోవడానికి చైనా చమురు కొనుగోళ్లను తగ్గించడమే ప్రధాన కారణం. యుద్ధానికి ముందు చైనా సగటున రోజుకు 11.6 మిలియన్ బారెళ్లను దిగుమతి చేసుకునేది. కానీ, బీజింగ్ విడుదల చేసిన అధికారిక కస్టమ్స్ డేటా ప్రకారం, మే నాటికి ఈ కొనుగోళ్లు ఏకంగా 8 మిలియన్ బారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. ఇది గత ఎనిమిదేళ్లలో చైనా సాధించిన అత్యంత కనిష్ట స్థాయి దిగుమతి. చైనా తన వ్యూహాత్మక చమురు నిల్వలపై ఆధారపడటం, దేశీయంగా క్రూడ్ ప్రాసెసింగ్‌ను తగ్గించడం, గత ఐదేళ్లుగా చైనాలో ఆటోమొబైల్ అమ్మకాలు రెండంకెల స్థాయిలో పడిపోవడం గ్లోబల్ డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. చైనా మార్కెట్ నెమ్మదించడం వల్లే ముడిచమురు ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి.

ప్రస్తుతం ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం చమురు మార్కెట్లో సరికొత్త అలజడికి తెరలేపింది. భవిష్యత్తులో డిమాండ్ కంటే సరఫరా విపరీతంగా పెరిగిపోనుందని IEA అంచనా వేస్తోంది.

రాబోయే రెండేళ్లలో అంతర్జాతీయ మార్కెట్ ఊహించని చమురు మిగులును చూడబోతోంది. 2027 నాటికి ప్రపంచ చమురు సరఫరా రోజుకు 8 మిలియన్ బారెళ్లు పెరుగుతుందని, అదే సమయంలో డిమాండ్ కేవలం 2 మిలియన్ బారెళ్లు మాత్రమే పెరుగుతుందని IEA లెక్కగట్టింది. అంటే, మార్కెట్లో భారీగా మిగులు ఏర్పడబోతోంది. దీనికి తోడు, యుద్ధ సమయంలో నిలిచిపోయిన దాదాపు 60 మిలియన్ బారెళ్ల చమురు హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంతో మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అమెరికా, బ్రెజిల్, గయానా, కెనడా వంటి ఒపెక్-యేతర దేశాలు ఉత్పత్తిని ముమ్మరంగా పెంచుతున్నాయి. మరోవైపు ఒపెక్ ప్లస్ దేశాలు కూడా తమ సరఫరా కోటాలను పెంచుతున్నాయి.

క్రిస్టాఫ్ రూహ్ల్ ఏం అంటున్నారు?

మారిన ఈ భౌగోళిక రాజకీయాల కారణంగా, క్రిస్టల్ ఎనర్జీ గ్లోబల్ అడ్వైజర్ క్రిస్టాఫ్ రూహ్ల్ ఒక సంచలన విశ్లేషణ చేశారు. 2027 నాటికి ప్రపంచ చమురు సరఫరా, డిమాండ్ కంటే రోజుకు ఒక మిలియన్ బారెళ్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మిగులు కారణంగా 2027 నాటికి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల కంటే దిగువకు పడిపోతాయని అంచనా వేశారు. ఆప్షన్స్ మార్కెట్‌లో ట్రేడర్లు సైతం ఇప్పుడు సరఫరా కొరత కంటే, ధరల పతనంపైనే పందాలు కాస్తున్నారు. ఇరాన్‌పై ఆంక్షలు సడలిస్తే, మిలియన్ల కొద్దీ అదనపు బారెళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. ఈ పరిస్థితి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు తమ అత్యవసర నిల్వలను, వ్యూహాత్మక చమురు నిల్వలను తక్కువ ధరకే పునర్నిర్మించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

తన చమురు అవసరాల కోసం 85 శాతం కంటే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడే భారత్‌కి ఈ చమురు మిగులు వార్త పెద్ద ఊరట కలిగించే అంశమే. అయితే, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, భారతీయ వినియోగదారులకు తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఈ చమురు మిగులు భారత్‌ ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులకు ఖచ్చితంగా సహాయపడుతుందని, కానీ ఆ ధరల తగ్గింపు ప్రయోజనం సామాన్యుడికి చేరడానికి కనీసం 5 నుండి 6 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే, మార్కెట్ అంచనాలు అతిగా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. IEA చేస్తున్న ఈ చమురు మిగులు అంచనాలను చమురు ఉత్పత్తి దేశాల కూటమి ‘ఒపెక్’ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మార్కెట్లో చమురు నిల్వలు పెరిగిపోతాయన్న ఐఈఏ అంచనాలకు సరైన ఆధారం లేదని ఒపెక్ కొట్టిపారేసింది. చమురు మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉందని, ఇలాంటి అతి వ్యూహాత్మక అంచనాలు మార్కెట్లో మరింత గందరగోళాన్ని, ధరల హెచ్చుతగ్గులను సృష్టిస్తాయని ఒపెక్ హెచ్చరిస్తోంది. పైగా, భారతదేశం పునరుత్పాదక ఇంధనం, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నప్పటికీ, అవి ఇంకా పూర్తి స్థాయిలో ‘వ్యాపారపరంగా లాభసాటి’ కాలేదని గుర్తు చేసింది.

అంతర్జాతీయ చమురు మార్కెట్ అనేది కేవలం డిమాండ్, సప్లైల ఆట కాదు.. అది జియోపాలిటిక్స్, మైండ్ గేమ్స్, వ్యూహాత్మక ఎత్తుగడల సమాహారం. హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడం, అమెరికా-ఇరాన్ ఒప్పందం తాత్కాలికంగా మార్కెట్‌ను శాంతింపజేశాయి. చమురు సర్‌ప్లస్ లోకి వెళ్తుందని, ధరలు భారీగా దిగివస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. మన పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గడానికి మాత్రం మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.

: CLN RAJU (EDITOR- NTV DIGITAL)