
IPL Franchises: భారత క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో అరుదైన ఘనతను సాధించింది. తొలిసారిగా ఐపీఎల్‌కు చెందిన 5 ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన “బర్గుండీ ప్రైవేట్, హురున్ ఇండియా” సంయుక్తంగా విడుదల చేసిన ఐదో ఎడిషన్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు దేశంలోని అత్యంత విలువైన ప్రభుత్వేతర సంస్థల జాబితాలో స్థానం సంపాదించాయి. ఈ జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రూ.20,850 కోట్ల విలువతో 270వ స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.19,550 కోట్ల విలువతో 285వ స్థానంలో నిలవగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.16,700 కోట్ల విలువతో 330వ ర్యాంక్ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ రూ.15,700 కోట్ల విలువతో 343వ స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ రూ.14,050 కోట్ల విలువతో 390వ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ ఐదు ఫ్రాంచైజీల మొత్తం విలువ దాదాపు రూ.87 వేల కోట్లకు చేరుకుంది. దీంతో టెక్నాలజీ, ఫైనాన్స్, తయారీ, వినియోగ వస్తువుల రంగాల్లోని ప్రముఖ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు నిలిచాయి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా, వినోద బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల స్పాన్సర్‌షిప్‌లు, భారీ మీడియా హక్కుల ఒప్పందాలు ఐపీఎల్ ఆర్థిక శక్తిని మరింత పెంచాయి.
ప్రత్యేకంగా 2022లో సుమారు రూ.48,400 కోట్లకు అమ్ముడైన మీడియా హక్కులు ఫ్రాంచైజీల ఆదాయానికి ప్రధాన వనరుగా మారాయి. స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, మెర్చండైజింగ్, డిజిటల్ కంటెంట్, లైసెన్సింగ్ వంటి మార్గాల ద్వారా కూడా జట్లు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఐపీఎల్ యాజమాన్యాలు విదేశీ టీ20 లీగ్‌లలో కూడా జట్లను నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ వ్యాపారాన్ని విస్తరించాయి. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేవలం క్రికెట్ జట్లుగానే కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తులుగా కూడా గుర్తింపు పొందుతున్నాయి.