Reading Time: 2 minutes
Shubman Gill Overtakes Virat Kohli Icc Odi Batting Rankings 2026

Shubman Gill: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌తో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ తన సహచర ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టడం విశేషంగా మారింది. అఫ్గానిస్తాన్‌పై జరిగిన సిరీస్‌లో గిల్ మొదటి వన్డేలోనే 84 పరుగులతో రాణించడమే కాకుండా, రెండో వన్డేలో 154 పరుగుల వీరోచిత సెంచరీతో అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ అమోఘమైన ప్రదర్శనకు గానూ అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కడంతో పాటు ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు.

మరోవైపు, గత కొంతకాలంగా రెండో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. ఆర్‌సీబీ, జీటీ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కుడి కాళ్లకు తగిలిన గాయం (రైట్ హామ్‌స్ట్రింగ్ ఇంజూరీ) కారణంగా కోహ్లీ ఈ అఫ్గాన్ సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. కోహ్లీ మ్యాచ్‌లో లేకపోవడం గిల్‌కి కలిసి వచ్చింది. ఇదే అదునుగా గిల్‌ రేటింగ్‌లో కోహ్లీని అధిగమించాడు. ఇక టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ 115 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ సిరీస్‌లో మొత్తం 143 పరుగులు చేశాడు. ఇందులో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన 48, 79 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ సైతం ఉన్నాయి. దీంతో రోహిత్ వన్డే ర్యాంకింగ్స్‌లో తన నాలుగో స్థానాన్ని విజయవంతంగా పదిలం చేసుకున్నాడు.

అయితే, ర్యాంకింగ్స్ రేసులో ఈ అగ్రస్థానాల పోరు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ వచ్చే జూలై నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్కడ గిల్‌తో పోటీపడుతూ తన నంబర్ 2 స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కోహ్లీ చూస్తుంటే.. అటు రోహిత్ శర్మ సైతం మరింత పైకి ఎగబాకాలని భావిస్తున్నాడు. భారత అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకారం.. మొదటి వన్డే జూలై 14 (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే జూలై 16 (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో, అలాగే చివరిదైన మూడో వన్డే జూలై 19 (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్నాయి. ఇక, ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. గిల్‌ను అధిగమిస్తాడా? వేచిచూద్దాం..