Reading Time: < 1 minute

రూ. 7 కోట్ల సీఎంఆర్ ఎగవేత..ఇద్దరు రైస్ మిల్లర్లు అరెస్ట్

Caption of Image.
  • ఇప్పటివరకు రూ.158 కోట్లు ఎగ్గొట్టిన ఘనుడు

సుల్తానాబాద్, వెలుగు: ప్రభుత్వానికి అప్పగించాల్సిన రూ.7 కోట్ల విలువైన రేషన్​ బియ్యాన్ని ఎగవేసిన కేసులో ఇద్దరు రైస్ మిల్లర్లను మంగళవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి సుల్తానాబాద్ వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ శివారులో ఉన్న సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు పౌర సరఫరాల శాఖ 3116.360 మెట్రిక్ టన్నుల వడ్లను కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పగించింది. 

ఈ వడ్లకు గాను 2024 సెప్టెంబర్ 30లోపు 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లు యాజమాన్యం కేవలం 515.158 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగించింది. మిగతా బియ్యం కోసం అధికారులు పలుమార్లు ఒత్తిడి చేసినా స్పందించలేదు. మిల్లులో తనిఖీలు నిర్వహించగా సంబంధిత నిల్వలు లేవని గుర్తించారు. గడువు పొడిగించినప్పటికీ బియ్యం ఇవ్వకపోవడంతో, సరుకును నిందితులు తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ. 7 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 

పౌర సరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్​నర్ కరీంనగర్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండారి మారుతి, మిల్లు పార్ట్​నర్ కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సొక్కం అంజయ్యను అరెస్ట్ చేశారు. 

ప్రధాన నిందితుడు బండారి మారుతిపై గతంలోనూ ఇదే తరహా సీఎంఆర్ కుంభకోణాలకు సంబంధించి ఇల్లంతకుంట, జమ్మికుంట, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతను దాదాపు రూ.158 కోట్ల విలువైన బియ్యం ఎగవేసినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో ఏసీపీ జి. కృష్ణ, సీఐ రంజిత్ రావు, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.