Reading Time: < 1 minute

ఫ్యాన్సీ నంబర్ కావాలా నాయనా.. భలే ప్లాన్ వేసిన విజయ్ సర్కార్ !

Caption of Image.

కొందరికి ఫ్యాన్సీ నంబర్లంటే విపరీతమైన వ్యామోహం ఉంటుంది. న్యూమరాలజిస్ట్ చెప్పాడనో, డేట్ ఆఫ్ బర్త్ కలిసి వచ్చేలా నంబర్ ఉండాలనో.. పెళ్లి రోజు అనో, పిల్లల పుట్టిన రోజు అనో.. ఇలా రకరకాల కారణాలతో ఫ్యాన్సీ నంబర్ల కోసం కార్ల యజమానులు పోటీ పడుతుంటారు. ఒక బడ్జెట్ కారు కొనేంత మొత్తం నంబర్ ప్లేట్కు పెట్టేందుకు కూడా కొందరు వెనుకాడరు. ఈ వ్యామోహాన్ని ప్రభుత్వ ఆదాయ మార్గంగా మార్చుకోవాలని తమిళనాడులో విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది.

తమిళనాడులో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల రుసుమును భారీగా పెంచాలని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల కోసం 8 లక్షల రూపాయల వరకూ వసూలు చేసేలా కొత్త ప్రీమియం కేటగిరీని ప్రవేశపెట్టింది. ఐదు నుంచి ఎనిమిది ఫ్యూఛర్ సిరీస్ కావాలంటే రూ.1.2 లక్షలు చెల్లించాలి.

తొమ్మిది నుంచి పది ఫ్యూచర్ సిరీస్ నంబర్లు కావాలంటే 2 లక్షలు, 11 నుంచి 12 ఫ్యూచర్ సిరీస్ ఫ్యాన్సీ నంబర్ కావాలంటే 4 లక్షల దాకా చెల్లించక తప్పని పరిస్థితి. పదమూడు, పద్నాలుగు ఫ్యూచర్ సిరీస్ ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలంటే అత్యధికంగా 8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదన అమలయితే, 2012 తర్వాత తమిళనాడులో రిజిస్ట్రేషన్ నంబర్ ఛార్జీలకు సంబంధించి ఇదే మొదటి ప్రధాన సవరణ అవుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం, వాహన రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్లను యాదృచ్ఛికంగా కేటాయిస్తారు. అయితే, ఒక నిర్దిష్ట నంబరును పొందాలనుకునే యజమానులు అదనపు రుసుము చెల్లించి ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వాహన నంబర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, ఈ కొత్త ప్రతిపాదన ఆ రుసుములను, ముఖ్యంగా భవిష్యత్ సిరీస్‌ల రిజిస్ట్రేషన్ నంబర్లకు, గణనీయంగా పెంచాలనేది విజయ్ సర్కార్ ఆలోచనగా తెలిసింది.

©️ VIL Media Pvt Ltd.