
- రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో ‘బర్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్’లో ఘటన
- గతంలో ఇరాన్ దాడితో దెబ్బతిన్న టెర్మినల్
- తిరిగి ప్రారంభిస్తున్న క్రమంలో పేలుడు
- మృతుల్లో పలువురు ఇండియన్లు
దుబాయ్: ఖతార్‌లోని కీలకమైన నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ టెర్మినల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, మరో 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈ టెర్మినల్‌పై ఇరాన్, అమెరికా యుద్దం సమయంలో ఇరాన్ దాడి చేయడంతో టెర్మినల్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. తిరిగి వాటిని ప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా నాచురల్గ్యాస్ ను ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. ఇరాన్‌తో యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిపై రవాణా నిలిచిపోవడంతో ఖతార్ తన గ్యాస్ ఉత్పత్తిని ఆపేసింది. అయితే, ప్రస్తుతం యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇరాన్ తన పట్టును కాస్త సడలించడంతో ఖతార్ ఈ టెర్మినల్‌ను తిరిగి ప్రారంభించే పనులను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బర్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించిందని ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ షెరిడా అల్-కాబీ సోమవారం దోహాలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన 13 మంది భారతదేశం, పాకిస్తాన్‌కు చెందిన వారని చెప్పారు.
గాయపడిన 66 మందిలో ఖతార్‌తో పాటు పలు ఆఫ్రికా, ఆసియా దేశాల పౌరులు ఉన్నారని తెలిపారు. అయితే, ఈ ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందని, దీని వెనుక ఎలాంటి విధ్వంసక చర్యగానీ, శత్రుదేశాల కుట్రగానీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రమాదం వల్ల ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఈ బర్జాన్ ప్లాంట్ రోజుకు దాదాపు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది.
ఖతార్ దీనిని ప్రధానంగా స్థానిక విద్యుత్ ఉత్పత్తికి, ఎడారి ప్రాంతంలో నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల కోసం ఉపయోగిస్తుంది. ఈ ప్లాంట్‌లో ఖతార్ ప్రభుత్వానికి దాదాపు పూర్తి వాటా ఉండగా, అమెరికాకు చెందిన ఎక్సాన్ మోబిల్ సంస్థకు కూడా స్వల్ప వాటా ఉంది. ఈ పేలుడు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.