
US Citizenship Fee Hike: అమెరికాలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం (అమెరికన్ సిటిజన్‌షిప్) తీసుకోవాలనుకుంటున్న భారతీయ వలసదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం పొందడం ఇకపై మరింత భారంగా, ఖరీదుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇటీవల ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫీజు మినహాయింపులు, తక్కువ ఫీజు ఆప్షన్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన గనుక ఆమోదం పొందితే, నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా అమెరికా పౌరసత్వం పొందడం మునుపటి కంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ‘ఫామ్ N-400’ ఫీజును భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం పేపర్ (ఆఫ్‌లైన్) ద్వారా అప్లై చేసుకుంటే 760 డాలర్లుగా ఉన్న ఫీజును ఏకంగా 1,330 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ప్రస్తుతమున్న 710 డాలర్ల ఫీజు కాస్తా 1,280 డాలర్లకు చేరనుంది. అంటే దాదాపు 75 నుంచి 80 శాతం వరకు ఫీజులు పెరగనున్నాయి. దీనితో పాటు, ఒకవేళ పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలు చేసే ‘ఫామ్ N-336’ ఫీజును కూడా పెంచాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది.
ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎందుకంటే, 2024లో అమెరికా పౌరసత్వం పొందిన వారిలో అత్యధికంగా మెక్సికో (13 శాతం) మొదటి స్థానంలో ఉంటే, 6 శాతంతో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. గత ఐదేళ్లలోనే దాదాపు 3.7 లక్షల మంది భారతీయులు నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా అమెరికన్ సిటిజన్‌షిప్ పొందారు. ఈ తాజా ప్రతిపాదనపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు ఇంతలా పెంచితే తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారికి అమెరికా పౌరసత్వం కలగానే మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు. డీహెచ్ఎస్ మాజీ అధికారి ఆడమ్ క్లైన్ మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద మార్పు అని, పౌరసత్వం అనేది ప్రజలకు ఆర్థిక ఎదుగుదలను, సమాజంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని, ఫీజుల పెంపు వల్ల ఈ ఆశయాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు. అయితే, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మాత్రం ఈ ప్రతిపాదనను సమర్థించుకుంటోంది. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుల ద్వారా దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అయ్యే పూర్తి ఖర్చులు కూడా రావడం లేదని, నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఫీజులను సమీక్షించే ప్రక్రియలో భాగమే ఈ మార్పులని స్పష్టం చేసింది.