Reading Time: 2 minutes
Modi Trump India Us Trade Deal Ai Cooperation Bilateral Relations

భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు వేగం పుంజుకున్నాయి. వచ్చే నెలలో అమల్లోకి రానున్న కీలక టారిఫ్ గడువుకు ముందే తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI), అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు అమెరికా ఆసక్తి వ్యక్తం చేసింది.

అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో రెండు రోజులపాటు జరిగిన చర్చల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ సంప్రదాయంగా వ్యవసాయం, తయారీ రంగాల్లో బలంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు సాంకేతిక రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. “భారత్ AI రంగంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటోంది. భవిష్యత్తు సాంకేతికతలు, భవిష్యత్తు వాణిజ్య రంగాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలనే ఆసక్తి భారత్‌కు ఉంది” అని జేమిసన్ గ్రీర్ తెలిపారు.

భారత్-అమెరికా ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ చర్చల్లో భాగంగా మార్కెట్ యాక్సెస్, డిజిటల్ ట్రేడ్, సరఫరా గొలుసుల బలోపేతం, నాన్-టారిఫ్ అడ్డంకులు, వ్యూహాత్మక రంగాల్లో సహకారం వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిగినట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే AI, ఆధునిక సాంకేతిక రంగాలకు అనుగుణంగా కొత్త వాణిజ్య వ్యవస్థలను రూపొందించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని గ్రీర్ వెల్లడించారు.

జూలై 24తో అమెరికా అమలు చేస్తున్న తాత్కాలిక 10 శాతం టారిఫ్ విధానం గడువు ముగియనుంది. దీంతో ఆ తేదీకి ముందే ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని న్యూఢిల్లీ, వాషింగ్టన్ ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ప్రధాన చర్చాకర్తల స్థాయిలో జరిగిన సమావేశాల అనంతరం మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా టారిఫ్ విధానంలో వచ్చిన మార్పుల కారణంగా గతంలో రూపొందించిన వాణిజ్య రూపరేఖలను తిరిగి సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని, నిర్దేశిత గడువులోపు తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే మార్గాలపై ఇరు దేశాలు చర్చించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ భేటీలో కూడా వాణిజ్య ఒప్పందం ప్రధాన చర్చాంశంగా ఉన్నట్లు జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. “ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోడీ మధ్య అద్భుతమైన సంబంధం ఉంది. గత వారం G7 సదస్సులో ఇద్దరూ సమావేశమయ్యారు. భారత్-అమెరికా సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని వారు అంగీకరించారు. ఇందులో మేము పని చేస్తున్న వాణిజ్య ఒప్పందం మాత్రమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల ప్రతి అంశం కూడా భాగమే” అని గ్రీర్ పేర్కొన్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, సాంకేతికత, AI, సరఫరా గొలుసులు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.