
- మరణానంతరం మామిడి రామారెడ్డికి అవార్డు.. అందుకున్న భార్య శ్యామలా రెడ్డి
- తెలుగు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డులు
- డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్
- సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కేటీ థామస్, జర్నలిస్టు నారాయణన్‌కు పద్మ విభూషణ్
- 65 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. ఇందులో తెలంగాణ నుంచి దేశానికి సేవలందించిన నలుగురు ప్రముఖులు ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకున్నారు.
రక్షణ, సైన్స్ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు. కాగా, పశుసంవర్ధక విభాగంలో విశేష సేవలు అందించిన తెలంగాణకు చెందిన మామిడి రమారెడ్డికి మరణాంతరం పద్మశ్రీ అవార్డు లభించగా, ఆయన తరఫున భార్య శ్యామలా రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ
ఈ వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయంగా క్యాన్సర్ నివారణ, వైద్య రంగంలో ఎనలేని సేవలందించిన తెలుగు మూలాలున్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అందుకున్నారు.
అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్, వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. జాతీయ ప్రముఖుల్లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కేటీ థామస్, సీనియర్ జర్నలిస్ట్ పి. నారాయణన్‌లు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు.
మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌లు పద్మభూషణ్ స్వీకరించగా.. నటుడు ఆర్. మాధవన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర వీఐపీలు పాల్గొన్నారు.
కాగా… ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం మొత్తం 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మే 25 న తొలి దశలో 66 మందికి రాష్ట్రపతి అవార్డులను అందజేసారు. తాజాగా మరో 65 మందిలో.. 2 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ, 56 పద్మ శ్రీ అవార్డులను ప్రధానం చేశారు.