
మహిళా క్రికెటర్ల విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ ఆటలోకి రావడానికి ఐసీసీ విడుదల చేసిన మార్గదర్శకాలను స్వాగతించారు. మహిళల క్రికెట్ భవిష్యత్తుకు ఇవి భారీ ప్రోత్సాహం అని కొనియాడారు.
ప్రసవానంతరం మహిళా ప్లేయర్లు సురక్షితంగా, నిలకడగా క్రికెట్‌లోకి తిరిగి వచ్చేలా చూసేందుకు, ఐసీసీ సోమవారం ( జూన్22) కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డెలివరీ తర్వాత ఎర్లీ రికవరీ, శిక్షణ, రీ ఎంట్రీకి ముందు 16 వారాల వ్యవధిలో కండిషనింగ్ వంటి అంశాలపై గైడ్ లైన్స్ విడుదల చేశారు. మహిళా క్రికెటర్ల కోసం రూపొందించిన డెలివరీ తర్వాత ఆటలోకి తిరిగి వచ్చే గైడ్ లైన్స్ పేరిట.. ఆరు ‘R’ల ఫ్రేమ్‌వర్క్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది.
అవి: రెడీ (Ready), రివ్యూ (Review), రిస్టోర్ (Restore), రీకండిషన్ (Recondition), రిటర్న్ (Return) రిఫైన్ (Refine).
@ICC అద్భుత నిర్ణయం తీసుకుంది. క్రీడలలో మహిళా సాధికారత అంటే, ఒక ప్లేయర్ జర్నీలో అన్ని దశల్లోనూ మద్దతు లభించేలా చూడటం. ఆటనా, మాతృత్వమా.? అని రెండింటిలో ఒకటి ఎంచుకోవడం నుంచి రెండూ చేయడం .. అనే అవకాశం కల్పించడం గొప్పవిషయం. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్ల భవిష్యత్తుకు ఇది మాస్సివ్ బూస్ట్ అని టెండూల్కర్ X లో రాసుకొచ్చారు.
►ALSO READ | FIFA: పోర్చుగల్కు భారీ షాక్.. గ్రూప్–కె లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కొలంబియా
గర్భధారణ తర్వాత క్రికెట్‌లోకి తిరిగి వచ్చే క్రీడాకారుల కోసం ఒక ప్రత్యేక కేస్ మేనేజర్ ను నియమించేలా ఐసీసీ గైడ్ లైన్స్ లో పేర్కొంది. కేస్ మేనేజర్ వైద్యుడిగా లేదా ఫిజియోథెరపిస్ట్ ఉండాలని సూచించింది.
ఈ కేస్ మేనేజర్ తొలి సమీక్షలో, తల్లిగా జీవితానికి అలవాటుపడటంలో క్రీడాకారిణికి మానసిక మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడతారు, ఆ తర్వాత దశలవారీగా ఆమె ఆటకు సిద్ధమయ్యేలా శిక్షణను తిరిగి ప్రారంభిస్తారు.
ప్లేయర్ ను తిరిగి ఆటలోకి అనుమతించడానికి ముందు, కండరాలు, ఎముకలు, కంటి సమస్యలు మొదలైన అన్ని కోణాలలో క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు.