Reading Time: < 1 minute

ప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్‌: ఎంపీ రఘునందన్ రావు

Caption of Image.

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. సోమవారం (జూన్ 22) న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ నాలుగో రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి జాతీయ ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా ఆహ్వానం మేరకు రఘునందన్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా, ఖేలో సన్స్‌ద్‌ ఉత్సవ్‌ వంటి కార్యక్రమాల ద్వారా గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో క్రీడా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయని అన్నారు.

►ALSO READ | కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‎తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపియన్లు సహా ఆసియా ఖండంలోని ప్రముఖ ఫెన్సర్లతో భారత క్రీడాకారులు పోటీపడటం దేశంలో ఫెన్సింగ్‌ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జాతీయ ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా, నిర్వాహకులు, ఇతర సహాయక సిబ్బందిని రఘునందన్‌ రావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నాలుగో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు ప్రదానం చేశారు. ఈ నెల 19న ప్రారంభమైన ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జూన్‌ 24న ముగియనున్నాయి.

©️ VIL Media Pvt Ltd.