అసలు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎందుకు చేయాలి? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక షాకింగ్ నిజం చెప్పింది. ప్రపంచంలో జరుగుతున్న చాలా మరణాలకు సరైన శారీరక వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తూ, నేటి కాలంలో నూటికి 80 మంది తగినంత శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
రోజుకు ఎంతసేపు వ్యాయామం చేయాలి?: శరీరం, మనస్సు ఎల్లప్పుడూ క్రియాశీలంగా (యాక్టివ్‌గా) ఉండాలంటే నిరంతరం శారీరక శ్రమ అవసరం. పెద్దలు ప్రతిరోజూ కనీసం అరగంట (30 నిమిషాలు) పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇక పిల్లల విషయానికి వస్తే, వారు రోజుకు కనీసం ఒక గంట పాటు శారీరకంగా చురుకుగా ఉండాలి. ఆటలు ఆడడం, పరుగెత్తడం వంటి వాటి ద్వారా వారికి రోజువారీ శ్రమ దొరికేలా చూడాలి.

ఇంట్లోనే సులభంగా చేసే వ్యాయామాలు: వ్యాయామం అంటే కేవలం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మెట్లు ఎక్కడం, దిగడం చేయవచ్చు. ఒళ్లు విరుచుకునే స్ట్రెచింగ్ వ్యాయామాలు అలవాటు చేసుకోవచ్చు. ఏదీ కుదరకపోతే నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని కాసేపు సరదాగా డ్యాన్స్ చేయొచ్చు. ఇక మనం చేసే ఏ యాక్టివిటీ అయినా రాత్రి పూట మంచి నిద్రను ఇచ్చేలా, ఆరోగ్యాన్ని పెంచేలా ఉండాలి.
కూర్చునే విధానంలో జాగ్రత్తలు: ఆఫీసుల్లో లేదా ఇంట్లో పనిచేసే సమయంలో ఎలా కూర్చుంటున్నారో ఒకసారి గమనించుకోవాలి. ఎక్కువ సమయం ఒకేచోట కూర్చొని పనిచేయడం లేదా గంటల తరబడి టీవీ చూడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మధ్యమధ్యలో కాసేపు లేచి అటూ ఇటూ తిరగాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే, ప్రతి అరగంటకొకసారి చిన్న బ్రేక్ తీసుకుంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
మానసిక ప్రశాంతత కోసం యోగా: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. దీనికోసం ప్రతిరోజూ కొద్దిసేపు యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే బ్రీతింగ్ (శ్వాస) వ్యాయామాలు చేయడం మరువద్దు. అలాగే, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కాసేపు ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
ఇక శారీరక శ్రమ లేకపోవడం అనేది మన ఆరోగ్యానికి నెమ్మదిగా చేటు చేసే ఒక పెద్ద సమస్య. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, టీవీ చూస్తూ ఆన్‌లైన్ వ్యాయామ క్లాసులు ఫాలో అవ్వడం లేదా డ్యాన్స్ చేయడం ద్వారా మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఇప్పటికైనా బద్ధకాన్ని వదిలి, రోజూ కాసేపు వ్యాయామం చేసి నిండు నూరేళ్ల ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.
గమనిక: మీరు మొదటిసారిగా వ్యాయామాలు ప్రారంభిస్తున్నట్లయితే లేదా ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే, ఒకేసారి కఠినమైన వ్యాయామాలు చేయకుండా నిపుణులు లేదా డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.
The post శారీరక వ్యాయామం లోపం.. అనేక మరణాలకు కారణమా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.