
ముంబై: 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో రికార్డులు తిరగరాస్తోన్న టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ప్రతిభ అసాధారణమైనదని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 16 ఏళ్ల వయసులో భారత గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు వైభవ్ కూడా అలాగే రాణిస్తున్నాడని ప్రశంసించారు.
అయితే, 16 ఏళ్ల వయసులో సచిన్ లాగే కనిపిస్తున్న వైభవ్.. సచిన్ లాగా అంత సుదీర్ఘ కాలం పాటు ఆడగలడా అని కపిల్ దేవ్ సందేహం వ్యక్తం చేశారు. అతనికి ఇప్పుడు 15 సంవత్సరాలేనని.. కెరీర్లో అతను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వైభవ్‌కు తెలిసిందల్లా క్రికెట్ ఒక్కటే.. కానీ అతనికి 20-22 ఏళ్లు వచ్చాకే కెరీర్లో అసలైన సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఆ వయసులోనే అతనికి జీవితం గురించి తెలుస్తుందని.. అప్పుడు పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. అందుకే వైభవ్ సూర్యవంశీకి 20-22 ఏళ్లు వచ్చాకే అతని ప్రదర్శనపై ఒక అంచనాకు రాగలమని పేర్కొన్నారు. అప్పటి వరకు మీడియా, అభిమానులు అతడిపై అనవసర ఒత్తిడి పెట్టి.. కెరీర్‌ను నాశనం చేయొద్దని సూచించారు. ఇక, ఐపీఎల్లో ఆడటం, దేశం తరుఫున ఆడటం రెండు వేర్వేరు అంశాలని.. దానికి దీనికి చాలా తేడా ఉంటుందని చెప్పారు.
వైభవ్ వండర్స్:
15 ఏళ్ల వైభవ్ క్రికెట్ ప్రపంచంలో వండర్స్ సృష్టిస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో క్రికెట్ ప్రియులను విస్మయానికి గురి చేస్తున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ వంటి హేమాహేమీలను అధిగమించి ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్శించిన వైభవ్ ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు.
శ్రీలంక, ఇండియా, ఆప్ఘాన్ మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో భారత్ ఏ జట్టు తరుఫున బరిలోకి దిగిన వైభవ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ లో సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన అసాధారణ ప్రతిభతో అతి పిన్న వయసులోనే భారత జాతీయ జట్టుకు (ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు) ఎంపికై.. సచిన్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.