Reading Time: < 1 minute
Cbse Revaluation Miracle Avni Kejriwal Scores Perfect 500 Out Of 500 Emerges National Topper

CBSE Revaluation: సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాల్లో రాంచీకి చెందిన విద్యార్థిని ‘అవ్ని కేజ్రీవాల్’ (Avni Kejriwal) అరుదైన ఘనత సాధించింది. డీపీఎస్ సేల్ టౌన్‌షిప్‌లో కామర్స్ విభాగంలో చదివిన అవ్ని.. రీవాల్యుయేషన్‌ తర్వాత 5 సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి 500కు 500 స్కోర్‌తో నేషనల్ టాపర్ గా అవతరించింది.

మొదట విడుదలైన ఫలితాల్లో ఆమెకు 95% మార్కులు వచ్చినప్పటికీ.. తన పరీక్షలు బాగా రాశానన్న నమ్మకంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసింది. ఇక రీవాల్యుయేషన్ తర్వాత ఇంగ్లిష్ కోర్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పూర్తి 100 మార్కులు లభించాయి. మరో సబ్జెక్ట్ అయిన గ్రాఫిక్స్‌లో 99 మార్కులు సాధించింది.

తన ప్రిపరేషన్, పరీక్షల ప్రదర్శనపై పూర్తి విశ్వాసం ఉండటంతోనే రీవాల్యుయేషన్‌కు వెళ్లానని అవ్ని తెలిపింది. ఫలితాలు వచ్చిన తర్వాత తన నమ్మకం నిజమైందని, ఈ విజయంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. అవ్ని తల్లిదండ్రులు కూడా ఆమె చిన్నప్పటి నుంచే చదువుల పట్ల అంకితభావంతో ఉంటుందని పేర్కొన్నారు. నిరంతర కృషి, క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరుకుందని వారు తెలిపారు. అవ్ని తండ్రి మితేష్ కేజ్రీవాల్ వ్యాపారవేత్త కాగా, తల్లి పూనమ్ కేజ్రీవాల్ గృహిణి.

తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా తన మెంటర్ సచిత్ సర్ అందించిన మార్గదర్శకత్వమే కారణమని అవ్ని చెప్పుకొచ్చింది. వారి ప్రోత్సాహం, సహకారం లేకపోతే ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని చెప్పింది. భవిష్యత్తులో బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలని అవ్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత విద్య కోసం ఇప్పటికే సీయూఈటీ యూజీ 2026 పరీక్ష కూడా రాసింది.