
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే ఆషామాషీ కాదు. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అదృష్టంతో పాటు కఠోర శ్రమ, పట్టుదల కూడా చాలా అవసరం. అన్నిటికీ మించి విజయం దరిచేరేవరకు ఓపికగా, సహనంగా ఉండాలి. బాలీవుడ్ ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ జీవితమే ఇందుకు సజీవ నిదర్శనం. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఈ సూపర్‌స్టార్, ఒకప్పుడు ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) క్యాంటీన్‌లో సమోసాలు సప్లై చేశాడంటే ఎవరైనా నమ్ముతార? కానీ ఇది నిజం. సీనియర్ నటుడు పంకజ్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని పలు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో ఎన్‌ఎస్‌డిలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ కింగ్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. 1970వ దశకంలో తాను ఎన్‌ఎస్‌డిలో చదువుకునేవాడినని ఆయన అన్నారు. ఆ సమయంలో, ఒక చిన్న బాలుడు తరచుగా క్యాంటీన్‌కు సమోసాలు తీసుకువచ్చేవాడు. ఆ బాలుడు మరెవరో కాదు ఇప్పటి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అని పంకజ్ కపూర్ పేర్కొన్నారు. షారుఖ్ తండ్రి లేదా కుటుంబ సభ్యులలో ఒకరు ఎన్‌ఎస్‌డీ క్యాంటీన్ తో పాటు మెస్ నిర్వహణలో పాలుపంచుకునేవారు. అందువల్ల, షారుఖ్ చిన్నతనంలో తరచుగా ఆ ప్రాంతంలో కనిపించేవాడు. అయితే, ఆ సమయంలో ఈ సాదాసీదా బాలుడు భవిష్యత్తులో భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఏలుతాడని ఎవరూ ఊహించలేదు.
షారుఖ్ ఖాన్‌కు ఎన్‌ఎస్‌డీతో చాలా అనుబంధం ఉంది. అతని తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ ఢిల్లీలో ‘ఖతీర్’ అనే రెస్టారెంట్‌ను నడిపేవారు. తన తండ్రి ఎన్‌ఎస్‌డీ మెస్ క్యాంటీన్ సంబంధిత కార్యకలాపాలలో పాలుపంచుకునేవారని షారుఖ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.ఈ కారణంగానే, షారుఖ్‌కు చిన్నతనం నుంచే నటన తో పాటు సినిమాలపై కూడా ఆసక్తి పెరిగింది. ఎన్‌ఎస్‌డి నుండీ చాలా మంది గొప్ప నటులు ఉద్భవించారు. అలా షారుఖ్ కూడా ఈ దిగ్గజ నటుల నుంచి స్ఫూర్తి పొంది సినిమా పాఠాలు నేర్చుకున్నాడు.
1992లో విడుదలైన ‘దీవానా’ చిత్రంతో షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రిషి కపూర్ కథానాయకుడిగా నటించారు. అయినా షారుఖ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత షారుఖ్ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒకప్పుడు క్యాంటీన్లలో సమోసాలు డెలివరీ చేసిన షారుఖ్ ఖాన్, నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మొత్తం సంపద సుమారు రూ. 12,490 కోట్లు అని తెలుస్తోంది.
కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి