Reading Time: 2 minutes
క్రేజీ ఆఫర్: ఎలుగుబంటిలా నటిస్తే చాలు.. లక్షల్లో జీతం..కానీ ఆ కండిషన్స్ మామూలుగా లేవుగా..!

చైనాలోని జూలు నిరంతరం తమ వింత చేష్టలతో వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఒక చైనీస్ జూ, ఎలుగుబంటిలా నటించేందుకు (Bear Performer) ఒక వ్యక్తి కావాలంటూ అరుదైన ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఏడాదికి లక్షల్లో జీతంగా ఇస్తామని ఆఫర్ చేసింది. జీతం వినడానికి బాగానే ఉన్నా, ఇందులో ఒక పెద్ద కండిషన్ ఉంది. గతంలో చైనా జూలలో అసలైన ఎలుగుబంట్లకు బదులు మనుషులు నటిస్తున్నారనే వివాదాల నేపథ్యంలో వచ్చిన ఈ వినూత్న ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా జీతం:

అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. సదరు చైనీస్ జూ ఈ వింత ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి ఏడాదికి 15,000 డాలర్లు జీతంగా చెల్లించడానికి సిద్ధమైంది. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 12.5 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. జూలో ఉండే సన్‌ బేర్ (Sun Bear – మలేషియన్ ఎలుగుబంటి జాతి) తరహాలో సదరు అభ్యర్థి ప్రవర్తించాల్సి ఉంటుంది. పర్యాటకులు వచ్చినప్పుడు వెనుక కాళ్లపై నిలబడటం, వారికి చేతులూపుతూ అభివాదం చేయడం, జూ నిర్వాహకులు ఇచ్చే పండ్లను తినడం వంటివి ఈ ఉద్యోగ బాధ్యతలు.

కానీ.. ఆ క్యాచ్ (ట్విస్ట్) ఏంటంటే?:

లక్షల్లో జీతం వస్తుంది కదా అని ఈ ఉద్యోగం అంత సులువు ఏమీ కాదు. దీని వెనుక అత్యంత కష్టతరమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ఎలుగుబంటి ఆకారంలో ఉండే లావుపాటి, బరువైన బొచ్చు కాస్ట్యూమ్‌ను ధరించాలి. చైనాలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఆ కాస్ట్యూమ్ విప్పడానికి వీల్లేదు. ఆ వేడిలోనే గంటల తరబడి ఎన్‌క్లోజర్‌లో నిలబడాలి. పర్యాటకులకు ఎక్కడా అనుమానం రాకుండా, అచ్చం అసలైన ఎలుగుబంటి లాగే కదలికలు ప్రదర్శించాలి. కూర్చోవడం, నడవడం వంటివి సహజంగా ఉండాలి.

వివాదాల నేపథ్యంలో స్పష్టత:

గతంలో చైనాలోని హాంగ్‌జౌ (Hangzhou) జూలో ఉన్న ఒక ఎలుగుబంటి మనిషిలాగే వెనుక కాళ్లపై నిలబడటమే కాకుండా, దాని వెనుక చర్మంపై ముడతలు పడటంతో.. అది అసలైన జూ జంతువు కాదు, మనిషేనంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదం రేగింది. అప్పట్లో జూ యాజమాన్యం అది అసలైన జంతువేనని వాదించినప్పటికీ, ఇప్పుడు ఇలా బహిరంగంగానే మనుషులను ఎలుగుబంట్లుగా నియమించుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బుల కోసం ఈ ఎండల్లో ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఉండటం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..