
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఏడు కోట్ల రూపాయల సీఎంఆర్ (CMR) రైస్ కుంభకోణం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బండారు మారుతితో పాటు మరో నిందితుడు సోక్కం అంజయ్యలను డీసీపీ భూక్యా రామ్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు.
సుల్తానాబాద్ పట్టణంలోని పూసల వద్ద ఉన్న సౌభాగ్యలక్ష్మీ రైస్ మిల్లుకు సంబంధించి ప్రభుత్వానికి చేరాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చేయకుండా నిందితులు ఏడు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | 4 ఇళ్లు, 8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. ఎక్సైజ్ అధికారి అక్రమాస్తుల చిట్టా
గతంలో ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యానికి సంబంధించి మిల్లు నిర్వాహకులు మొత్తం 1603 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే, అందులో కేవలం 515 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే డెలివరీ చేసి… మిగతా బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లులోనే ఉంచి, తమ సొంత అవసరాలకు వాడుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేశారని డీసీపీ రామ్ రెడ్డి వివరించారు.
అంతేకాకుండా ప్రధాన నిందితుడు బండారు మారుతికి నేరచరిత్ర ఉందని… గతంలోనూ ఇతను వివిధ రైస్ మిల్లుల ద్వారా దాదాపు 158 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.