Reading Time: 2 minutes
Lionel Messi Creates History Becomes Fifa World Cups All Time Top Scorer Argentina Enters Knockouts

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో తన ప్రాముఖ్యత ఏంటో లియోనెల్ మెస్సీ నిరూపించారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన గ్రూప్-J మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి పురుషుల వరల్డ్‌ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించి.. 18 గోల్స్‌తో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.

డల్లాస్‌ లోని AT&T స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీకి ప్రారంభంలోనే రికార్డు సాధించే అవకాశం రాగా.. అయితే అతడు కొట్టిన పెనాల్టీని ఆస్ట్రియా గోల్‌ కీపర్ అడ్డుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే మెస్సీ అక్కడితో ఆగలేదు. 38వ నిమిషంలో బాక్స్ అంచున బంతిని అందుకున్న అతడు తనదైన శైలిలో అద్భుతమైన షాట్‌ తో గోల్ సాధించాడు.

ఆ గోల్‌తో వరల్డ్‌ కప్‌ లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో గోల్ చేసిన మూడో ఆటగాడిగా కూడా మెస్సీ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను ఫ్రాన్స్ లెజెండ్ జస్ట్ ఫాంటైన్, బ్రెజిల్ దిగ్గజం జైర్జిన్హో మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆస్ట్రియా మంచి డిఫెండింగ్ తో అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెస్సీ మాయాజాలాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో మరోసారి మెస్సీ తన క్లాస్ ఆటను చూపించాడు. జూలియన్ అల్వారెజ్ చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత వచ్చిన రీబౌండ్‌ను ఎంతో చాకచక్యంగా గోల్‌ గా మలిచి తన 18వ వరల్డ్‌ కప్ గోల్ నమోదు చేశాడు. దీంతో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించడమే కాకుండా నాకౌట్ దశకు కూడా అర్హత సాధించింది.

ఈ టోర్నీలో ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన మెస్సీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 38 ఏళ్ల వయసులోనూ అతడి ఆటతీరు యువ ఆటగాళ్లను తలపించేలా ఉంది. అంతేకాదు, వరల్డ్‌కప్ చరిత్రలో 6 ఎడిషన్లు ఆడిన తొలి ఆటగాడిగానూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అత్యధిక వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు, అత్యధిక విజయాలు వంటి అనేక రికార్డులను కూడా మరింత మెరుగుపర్చుకున్నాడు మెస్సి.

2022లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా, ఇప్పుడు వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. అల్జీరియాపై హ్యాట్రిక్, ఆస్ట్రియాపై డబుల్‌తో మెస్సీ మరోసారి టోర్నమెంట్‌లో దూకుడుగా కొనసాగుతున్నాడు. అంతేకాదు అతడి నాయకత్వంలో అర్జెంటీనా జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.