Lift Mirrors Reason: రోజూ ఆఫీసులు, మాల్స్, అపార్ట్మెంట్లలో మనం లిఫ్ట్ వాడుతూనే ఉంటాం. అయితే, ప్రతి లిఫ్ట్‌లోనూ కచ్చితంగా అద్దం (మిర్రర్) ఉండటాన్ని గమనించే ఉంటారు. చాలామంది ఇది కేవలం మనల్ని మనం చూసుకోవడానికో, లేదా కేవలం అలంకరణ కోసమో అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్, ప్రయాణికుల భద్రత దాగి ఉన్నాయి. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాత రోజుల్లో భయం.. ఆందోళన: పూర్వ కాలంలో లిఫ్ట్‌లు ఇనుప గ్రిల్స్ లేదా సాధారణ మూసివున్న డబ్బాల్లా ఉండేవి. ఆ సమయంలో లిఫ్ట్ ఎక్కిన ప్రయాణికులకు ఒక వింతైన అనుభూతి కలిగేది. లిఫ్ట్ చాలా వేగంగా పైకి వెళ్తోందని, లేదా కిందికి పడిపోతోందనే భయం వారిని వెంటాడేది. నిజానికి లిఫ్ట్ సాధారణ వేగంతోనే వెళ్తున్నప్పటికీ, లోపల ఉన్నవారికి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. గాల్లో తేలుతున్నట్లు, ఊపిరి ఆడనట్లు ఊహించుకుని తీవ్ర అసౌకర్యానికి గురై, కంపెనీలకు ఫిర్యాదులు చేసేవారు.
ఇంజనీర్ల అద్భుతమైన ఆలోచన..: ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు లిఫ్ట్ డిజైనర్లు, ఇంజనీర్లు తీవ్రంగా ఆలోచించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య సాంకేతికమైనది కాదు, కేవలం వారి మానసిక భ్రమ అని వారు గుర్తించారు. లిఫ్ట్‌లో ఉన్నప్పుడు ప్రజల దృష్టి అంతా ఆ వేగం మీద, క్లోజ్డ్ స్పేస్ మీద మాత్రమే ఉంటోందని అర్థం చేసుకున్నారు. అందుకే వారి దృష్టిని వేరే వైపు మళ్లించాలని ఒక తెలివైన ఉపాయం ఆలోచించారు. అదే లిఫ్ట్‌లో అద్దాలు ఏర్పాటు చేయడం.
పనిచేసిన మైండ్ గేమ్..!: లిఫ్ట్ లోపల అద్దాలను అమర్చిన తర్వాత ఊహించని మార్పు వచ్చింది. లిఫ్ట్ ఎక్కగానే ప్రజలు తమ దుస్తులను సర్దుకోవడం, జుట్టు సరిచేసుకోవడం లేదా అద్దంలో తమను తాము చూసుకోవడంలో నిమగ్నమైపోయారు. దీనివల్ల వారి పూర్తి దృష్టి వేగం నుంచి మళ్లిపోయింది. ఫలితంగా, లిఫ్ట్ వేగం పట్ల వచ్చే ఫిర్యాదులు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రజల్లో తెలియకుండానే భయం పోయి ప్రశాంతత చేకూరింది.
భద్రత, మానసిక ప్రశాంతత..: కేవలం దృష్టి మళ్లించడమే కాదు, క్లాస్ట్రోఫోబియా (ఇరుకైన ప్రదేశాలంటే భయం) ఉన్నవారికి ఈ అద్దాలు ఎంతో సహాయపడతాయి. అద్దం ఉండటం వల్ల ఆ చిన్న రూమ్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే, లిఫ్ట్‌లో మనతో పాటు ఉన్న ఇతర వ్యక్తుల కదలికలను గమనించడానికి, వారి నుంచి రక్షణగా ఉండటానికి కూడా ఈ అద్దాలు ఉపయోగపడతాయి.




