Reading Time: < 1 minute
Pil Filed In Ap High Court Seeking Cbi Probe Into Gade Saikrishna Lockup Death Case

Gade Sai Krishna Missing Case: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాయికృష్ణ మరణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు తదితర సాక్ష్యాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.

పోలీసు అధికారులపైనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసుల ద్వారా జరిగే దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, అందువల్ల స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఏ పోలీసు అధికారినీ దర్యాప్తులో భాగస్వామ్యం చేయకూడదని కూడా కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించిన పిటిషనర్, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశంపై సహేతుకమైన అనుమానం ఉన్నప్పుడు కేసులను సీబీఐకి బదిలీ చేసే అధికారం రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలకు ఉందని పేర్కొన్నారు.

అలాగే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తీవ్ర హింసకు గురిచేశారని, అనంతరం మరణించినట్లు చూపకుండా ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఇవన్నీ పిటిషనర్ చేసిన ఆరోపణలేనని, వాటిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసు విచారణ పూర్ణయ్యే వరకు సంబంధిత ఆధారాలు ధ్వంసం కాకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, అనంతరం దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.