Reading Time: 2 minutes
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదం అంచున ఉపాధ్యాయుల భవిష్యత్తు

న్యూఢిల్లీ, జూన్ 24: సీబీఎస్సీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం AI టీచర్లను పూర్తిగా భర్తీ చేయదు. అయితే కొత్త సాంకేతికతను స్వీకరించే ఉపాధ్యాయులు, దాన్ని పట్టించుకోని ఉపాధ్యాయుల మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని క్రైస్ట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. అభినవ్ పి. త్రిపాఠి మాట్లాడుతూ, AIని ప్రమాదంగా కాకుండా బోధనా సహాయక సాధనంగా ఉపయోగించగల ఉపాధ్యాయులకే భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు చిన్న వయసులోనే AI, కోడింగ్ వంటి అంశాలను నేర్చుకుంటున్నందున ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ మార్కెట్‌లో స్పష్టమైన మార్పు

ఉద్యోగాల నియామక వేదిక Apna.co వెల్లడించిన వివరాల ప్రకారం, 2024 నుంచి 2025 మధ్య డిజిటల్ మరియు టెక్నాలజీ ఆధారిత నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులపై డిమాండ్ 148 శాతం పెరిగింది. 2026 ప్రారంభ నాటికి ప్రతి 15 టీచింగ్ ఉద్యోగ ప్రకటనల్లో ఒకదానిలో AI, కోడింగ్ లేదా రోబోటిక్స్‌కు సంబంధించిన నైపుణ్యాలను ప్రత్యేకంగా కోరుతున్నట్లు వెల్లడైంది. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య ప్రతి 55 ఉద్యోగాల్లో ఒకటిగా మాత్రమే ఉండేది. రోబోటిక్స్, STEM ఉపాధ్యాయులపై డిమాండ్ 113 శాతం పెరగగా, AI, డేటా సైన్స్ ట్రైనర్ల కోసం ఉద్యోగావకాశాలు 81 శాతం పెరిగినట్లు సంస్థ పేర్కొంది.

బీఈడ్ విలువ తగ్గలేదు.. కానీ సరిపోదు

Apna.co సీఈఓ కార్తీక్ నారాయణ్ అభిప్రాయం ప్రకారం బీఈడ్ ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. అయితే నేటి అవసరాలకు అనుగుణంగా అది ఒక్కటే సరిపోదని స్పష్టం చేశారు. బీఈడ్ ఒక బలమైన పునాది. కానీ అది పూర్తి కథ కాదు. భవిష్యత్తులో ఉపాధ్యాయులు సాంకేతిక నైపుణ్యాలు కూడా అలవర్చుకోవాల్సిందేనిని ఆయన తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI విద్యలో భాగం కావడంతో టీచర్లకు శిక్షణ ఇచ్చే కొత్త మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. AI సర్టిఫికేషన్లు, కోడింగ్ శిక్షణలు, డిజిటల్ క్లాస్‌రూమ్ టెక్నాలజీ కోర్సులు, టీచర్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మానవ నైపుణ్యాలే అసలైన బలం

అయితే AI పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన మంచి టీచర్ కాలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి, ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే సామర్థ్యం ఉపాధ్యాయుల్లో ఉండాలని వారు సూచిస్తున్నారు. AI సాధనాలు పునరావృత పనులను తగ్గించగలిగినా, విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడం, భావోద్వేగ పరమైన మద్దతు అందించడం వంటి అంశాల్లో మానవ ఉపాధ్యాయుల పాత్రను భర్తీ చేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తు టీచర్ ఎలా ఉండాలి?

విద్యా రంగంలో జరుగుతున్న మార్పులను చూస్తే, భవిష్యత్తులో టీచర్‌కు రెండు కీలక అర్హతలు అవసరమయ్యే అవకాశం ఉంది. ఒకటి బీఈడ్ ద్వారా లభించే బోధనా నైపుణ్యాలు, రెండోది AI ఆధారిత తరగతి గదులను సమర్థంగా నిర్వహించే సాంకేతిక పరిజ్ఞానం. సీబీఎస్సీ AI పాఠ్యాంశాలను పాఠశాల స్థాయిలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాబోయే కాలంలో ఉపాధ్యాయ నియామకాల విధానం కూడా గణనీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.