Reading Time: < 1 minute

సీఎం సువేందుపై MP మహువా ప్రశంసలు.. TMC నుంచి మరో వికెట్ ఔట్..?

Caption of Image.

కోల్‎కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్‌బ్రాండ్, ఎంపీ మహువా మొయిత్రా వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తమ రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ సీఎం సువేందు అధికారితో తనకు ఒక భావోద్వేగ బంధం ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీఎంసీలో ఉన్నప్పుడు నాకు చాలా మద్దతు ఇచ్చారని.. తన రాజకీయ జీవితంలోని క్లిష్ట దశలో అండగా నిలబడ్డారని తెలిపారు. 

2014లో నాకు లోక్‌సభ టికెట్ రాలేదు. దీంతో ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ సమయంలో సువేందు నాకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. కరీంపూర్ నుంచి తొలిసారి పోటీ చేసినప్పుడు నా కోసం ప్రచారం చేయడానికి ఎవరూ రాలేదని.. ఒక్క సువేందు అధికారి మాత్రమే వచ్చారని చెప్పారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత తాము తరచుగా మాట్లాడుకోవడం లేదని.. కానీ క్లిష్ట సమయంలో ఆయన నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

వ్యక్తిగత సంబంధాలు పార్టీలకు అతీతమైనవని మహుతా నొక్కిచెప్పారు. టీఎంసీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీకి నమ్మకస్తురాలిగా ఎంపీ మహువా మొయిత్రాకు పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి అనంతరం కీలక నేతలు పార్టీని వీడినప్పటికీ మహువా మాత్రం దీదీతోనే ఉన్నారు. 

అయితే, మమతా బెనర్జీ రాజకీయ బద్దశత్రువు, సీఎం సువేందు అధికారిపై మహువా ప్రశంసలు కురిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ, పార్టీ చీఫ్ మమతాకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న తరుణంలో మహువా చేసిన కామెంట్స్ టీఎంసీకి మరో భారీ షాక్ తగలనుందా అనే ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.