
గతంలో కంటే ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గత బోనాలకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించి ఘనంగా నిర్వహించింది. ఈసారి 20 కోట్లు కేటాయించాలని కోరాం.. భారీ ఎత్తున ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
గతంలో ఒక్క కార్పొరేషన్ మాత్రమే ఉండేది.. ఇపుడు మూడు కార్పొరేషన్ కావడంతో బాధ్యతలు పెరిగాయి నిధులు కేటాయింపు కూడా అవసరం.. గతేడాది బోనాల జాతరకు పదికోట్లు ప్రభుత్వం కేటాయించింది.. ఈ సారి మూడు కార్పొరేషన్ల పరిధిలోని బోనాల ఘనంగా నిర్వహించేందుకు 20 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామన్నారు కొండా సురేఖ.
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఘనంగా బోనాల జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్ , మొబైల్ టాయిలెట్స్, జాతర లో క్యూ లైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా తోపులాట జరగకుండా పోలీస్ శాఖ తరుపున ఏర్పాట్లు చేయాలని కోరారు.
బోనాల జాతరలో ఈసారి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఉజ్జయిని, అక్కన్నమాదన్న, నల్ల పోచమ్మ ఆలయంల్లో అంబారీ ఊరేగింపు వంటి కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్దతో నిర్వహిస్తామన్నారు. ఫ్రీ బస్సు ఉండడంతో మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందుకు తగిన విధంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.