Reading Time: 2 minutes
Video: మీ తెలివి తగలెయ్య.. చైనా పిచ్చి క్రియేటివిటీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఏకంగా జంతువునే..

వింతలు, విడ్డూరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చైనాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జూ పార్కుకు వచ్చిన పర్యాటకులను బురిడీ కొట్టించడానికి అక్కడ నిర్వాహకులు చేసిన ప్లాన్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. తూర్పు చైనాలోని ఒక వైల్డ్‌లైఫ్ పార్కులో జీబ్రాను చూసేందుకు వెళ్లిన సందర్శకులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్నది అసలైన జీబ్రా కాదు.. నల్లటి చారలు పూసిన ఒక గాడిద అని గుర్తించడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వుల పువ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చెవులు చూసి పట్టుకున్నారు..

చైనాలోని వీఫాంగ్, అన్కియు ప్రాంతంలో ఉన్న కింగ్యున్ మౌంటైన్ ఫోక్ కస్టమ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. పార్కులోని ఒక కేజ్‌లో జీబ్రా లాంటి జంతువు కనిపించడంతో పర్యాటకులు దాన్ని వీడియో తీశారు. అయితే ఆ జంతువును నిశితంగా గమనించిన సందర్శకులకు ఏదో తేడా కొట్టింది. దానికి వేసిన నల్లటి రంగు చారలు సరిగ్గా లేకపోవడమే కాకుండా.. దాని పొడవాటి చెవులు, ముఖ కవళికలు అది జీబ్రా కాదు, గాడిద అని స్పష్టంగా తేల్చేశాయి. పైగా దాని పక్కనే ఉన్న మిగతా గాడిదలను చూసిన తర్వాత పర్యాటకులు నిర్వాహకుల మోసాన్ని ఈజీగా కనిపెట్టేశారు.

ఇది మోసం కాదు.. కాస్ ప్లే అంటున్న నిర్వాహకులు

ఈ నకిలీ జీబ్రా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు పార్కు యాజమాన్యంపై విమర్శల వర్షం కురిపించారు. అయితే దీనిపై పార్క్ సిబ్బంది ఇచ్చిన వివరణ మరింత విడ్డూరంగా ఉంది. తాము పర్యాటకులను మోసం చేయాలని అనుకోలేదని ఓ ఉద్యోగి సమర్థించుకున్నాడు. ఆ బోను వెలుపల అది అసలైన జీబ్రా అని తామెక్కడా బోర్డు పెట్టలేదని, కేవలం సందర్శకులను నవ్వించడానికి, వినోదం పంచడానికే గాడిదకు జీబ్రా లాగా వేషధారణ వేశామని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా తాము ఇలాంటి ప్రయోగాలు చేశామని సదరు ఉద్యోగి పేర్కొనడం గమనార్హం.

చైనా జూలలో ఇలాంటివి కొత్తేమీ కాదు..

చైనా జూ పార్కులలో ఇలాంటి నకిలీ జంతువుల ప్రదర్శనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వింత ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. 2025లో షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక పార్కులో కూడా ఇలాగే గాడిదకు రంగులు వేసి జీబ్రాగా చూపించి వివాదానికి తెరలేపారు. 2024లో తైజౌ జూలో రెండు చౌ చౌ జాతి కుక్కలకు నలుపు, నారింజ రంగులు వేసి పులులుగా మార్చడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మనుషులు జుట్టుకు రంగులు వేసుకున్నట్లే.. కుక్కలకు కూడా సేఫ్ కలర్స్ వేశామంటూ అప్పట్లో జూ యాజమాన్యం సమర్థించుకుంది. షాన్వీలోని మరో జూలో పాండా లాగా కనిపించేలా కుక్కలకు నలుపు, తెలుపు రంగులు వేసి ప్రదర్శనకు ఉంచారు.

వీడియో చూడండి..