
HONOR X80 Pro Max Launched: హానర్ (HONOR) కొత్తగా HONOR X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, మన్నికైన నిర్మాణం, అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా 11,000mAh బ్యాటరీ, ట్రిపుల్ IP రేటింగ్స్, 1.5K AMOLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది.
HONOR X80 Pro Maxలో కంపెనీ ఇప్పటివరకు అందించిన అతిపెద్ద 11,000mAh “Qinghai Lake” బ్యాటరీని అందించింది. ఈ భారీ బ్యాటరీకి 90W సూపర్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా.. 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఇతర డివైస్ లకు కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యాన్ని గాను ఈ ఫోన్ ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను కూడా సొంతం చేసుకుంది. లైవ్ స్ట్రీమింగ్‌లో 26 గంటలు 8 నిమిషాలు 34 సెకన్లు పనిచేసి రికార్డు సృష్టించింది. మన్నిక విషయంలో కూడా హానర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. SGS గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందిన ఈ ఫోన్ 3 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా రూపొందించబడింది. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.
HONOR X80 Pro Maxకు IP68, IP69, IP69K రేటింగ్స్ లభించాయి. 10 మీటర్ల లోతు వరకు నీటిలో పనిచేసే సామర్థ్యం ఉందని కంపెనీ తెలిపింది. 1 లక్ష సార్లు నీటిలో ముంచినా నిర్మాణ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ పేర్కొంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇది 6.8 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీతో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఫోన్ వైబ్రెంట్ ఆరంజ్, లైట్నింగ్ రెడ్, మూన్ లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం Qualcomm Snapdragon 6 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కొత్త Hummingbird Architecture 2.0 సిస్టమ్ ద్వారా ఆరు సంవత్సరాల పాటు స్మూత్ పనితీరును అందించేలా సాఫ్ట్‌వేర్‌ను ఆప్టిమైజ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కెమెరా విభాగంలో 50MP ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో అందించగా.. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా మాత్రమే ఉంది. ఇంకా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, 400% వాల్యూమ్ పెంపుతో స్టీరియో డ్యూయల్ స్పీకర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే.. 8GB+128GB వేరియంట్ ధర 1,999 యువాన్ (రూ.27,960)గా నిర్ణయించారు. 8GB+256GB మోడల్ 2,199 యువాన్, 8GB+512GB మోడల్ 2,499 యువాన్, 12GB+512GB వేరియంట్ 2,799 యువాన్ ధరలకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. జూన్ 26 నుంచి అధికారిక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.