Reading Time: 2 minutes
Ms Dhoni Creates History First Captain To Win All Three Icc Trophies Champions Trophy 2013 Anniversary

MS Dhoni Creates History: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 23 ఒక ప్రత్యేకమైన రోజు. 2013లో ఇదే రోజున క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంతో ధోనీ అరుదైన చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ, జడేజా కీలక ఇన్నింగ్స్‌లు:

ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఫైనల్లో వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 129/7 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33), శిఖర్ ధావన్ (31) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఒక దశలో విజయం దిశగా సాగింది. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రెండు కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. జడేజా, అశ్విన్ తలో రెండు వికెట్స్ పడగొట్టగా.. రైనా పరుగులు కట్టడి చేశాడు. చివరకు ఇంగ్లీష్ జట్టు 8 వికెట్లకు 124 పరుగులకు పరిమితమైంది.

ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత:

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన మొదటి కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. 2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. 2011లో వన్డే ప్రపంచకప్‌ను కూడా టీమిండియాకు అందించాడు. అనంతరం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచి.. తన కెప్టెన్సీ ప్రతిభను మహీ మరోసారి నిరూపించాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఏ కెప్టెన్ కూడా ధోనీ సాధించిన ఈ అరుదైన ఘనతను అందుకోలేకపోయాడు.

ఐసీసీ ట్రోఫీల హ్యాట్రిక్ కెప్టెన్:

ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడం, జట్టును విజయాల బాటలో నడిపించడం.. వంటి లక్షణాలతో ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లో కూడా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారత అభిమానులకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోగా.. ధోనీకి మాత్రం ‘ఐసీసీ ట్రోఫీల హ్యాట్రిక్ కెప్టెన్’ అనే చిరస్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే అభిమానులు అతడిని ఇప్పటికీ ‘కెప్టెన్ కూల్’గా, ‘క్రికెట్ గోట్’గా కొనియాడుతుంటారు.

ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా గెలిచిన ఐసీసీ ట్రోఫీలు:

2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్
2011 ఐసీసీ వన్డే ప్రపంచకప్
2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ