Reading Time: 3 minutes

స్పైడర్ ‘భైరవుడు’ ఫిక్షనల్.. రామ్‌సహాయ్ జైస్వాల్ రియల్.. చంపేసి అంత్యక్రియలకు వెళ్లే సైకో.. 3 నెలలు.. 8 మంది ప్రాణాలు !

Caption of Image.

ఛత్తీస్‌గఢ్‌: మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో నటుడు SJ సూర్య చేసిన ‘భైరవుడు’ క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. సినిమాను మర్చిపోయినా ‘భైరవుడు’ క్యారెక్టర్ను మాత్రం మర్చిపోలేం. స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చిన్నప్పటి నుంచి మనుషులను చంపేసి వారి సన్నిహితులు ఏడుస్తుంటే చెవులారా విని పైశాచిక ఆనందం పొందుతూ అనుభూతిని ఆస్వాదించే సైకో క్యారెక్టర్లో SJ సూర్య జీవించేశాడు. ఇలాంటి మనుషులు రియల్ లైఫ్లో కూడా ఉంటారని ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన రుజువు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బలోదా బజార్ జిల్లాలోని ఖర్వే గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ చావులతో ఊరు ఊరంతా భయంతో వణికిపోయింది. ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇలా వరుసగా ఊరిలో జనం చచ్చిపోతుంటే ఊరిపై క్షుద్ర పూజలు చేశారని.. చేతబడి చేశారని భయాందోళనలు రేకెత్తడం గ్రామీణ ప్రాంతాల్లో సర్వ సాధారణమైన విషయం. కానీ.. ఈ చావుల వెనుక అదే గ్రామానికి చెందిన ఒక సైకో ఉన్నాడని తెలిసి ఊరు ఊరంతా నివ్వెరపోయింది. చావులకు అసలు కారణం తెలిశాక గ్రామస్తులు విస్తుపోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఘటన ఈ గ్రామంలో జరిగింది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 6, మే 14 మధ్య ఖర్వే గ్రామంలో ఎనిమిది మంది మరణించారు. బద్రీ ప్రసాద్ పటేల్, బుటాలు సాహు, ఛత్తురామ్ సాహు, బుధ్రామ్ జైస్వాల్, వినోద్ సాహు, గజానంద్ మాంఝీ, చైతురామ్ సాహు, మహేత్రు సాహు చనిపోయారు. ఏడు మృతదేహాలను మహానది నది సమీపంలో పూడ్చిపెట్టగా, ఒకదానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ వరుస చావులపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని గ్రామస్తుల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 13న మహేత్రు సాహు మృతదేహాన్ని వెలికితీశారు. తరువాత జూన్ 16న మరో ఆరు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం, అంతర్గత అవయవాలు, మృతదేహాల్లో విషం కలిసిందో లేదే తేల్చేందుకు డెడ్ బాడీలను రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి పంపారు.

►ALSO READ | డైపర్లపై మంత్రి రాజీనామా డిమాండ్స్.. కాక్రోచ్ పార్టీ వినూత్న నిరసన.. సోషల్ మీడియాలో వైరల్

గ్రామానికి చెందిన రామ్‌సహాయ్ జైస్వాల్ అనే ఒక వ్యక్తి చుట్టూ అనుమానం వ్యాపించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మొదట ఎలుకల మందు అని చెప్పి..’బోరాక్స్’ పౌడర్ను కొన్నాడు. ఒక కుక్కపై ఈ మందును ప్రయోగించాడు. కుక్క చనిపోవడంతో.. తన దగ్గర ఉన్న విషం పనిచేస్తుందని గ్రహించాడు. ఫిబ్రవరి 6న బద్రి అనే గ్రామానికి చెందిన వ్యక్తిని టార్గెట్ చేశాడు. స్థానికంగా మద్యం దుకాణం నడిపే నిందితుడు.. బద్రి తాగే మద్యంలో బోరాక్స్ పౌడర్ కలిపి ఇచ్చాడు. బద్రి ఎటువంటి అనుమానం రాకుండా చనిపోవడంతో రామ్ సహాయ్ మరిన్ని హత్యలకు తెలివిగా ప్లాన్ చేశాడు.

ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు, బహిరంగ అవమానాలు, మాటలతో దూషించడం, అతని భార్యపై అనుమానాలు, మంత్రవిద్యపై మూఢనమ్మకాలు, భూ వివాదం, చివరికి రూ.50 వేలు అప్పు ఇచ్చిన వ్యక్తిని చంపాలనుకోవడం.. ఇలా రకరకాల కారణాలతో మిగిలిన ఏడుగురు బాధితులను మద్యంలో బోరెక్స్ పౌడర్ కలిపి ఇచ్చి చంపేశాడు. చనిపోయిన వారందరికీ మద్యం అలవాటు ఉండటంతో తాగి తాగి అనారోగ్యం కారణంగా చనిపోయారని గ్రామస్తులు తొలుత భావించారు.

కానీ.. మూడు నెలల్లో ఎనిమిది మంది చనిపోవడంతో రామ్ సహాయ్ జైస్వాల్పై అనుమానం బలపడింది. కానీ.. ఆ అనుమానం బలహీనపడే విధంగా నిందితుుడు చనిపోయిన వ్యక్తుల పాడె మోసేవాడు. అంత్యక్రియలకు హాజరయ్యేవాడు. స్మశానంలో బాధిత కుటుంబాలకు దహస సంస్కారాల సమయంలో సాయం చేశాడు. దీంతో.. రామ్ సహాయ్ జైస్వాల్పై బలపడిన అనుమానం క్రమంగా బలహీనపడింది. పోలీసులు ఈ కేసును విచారించిన సమయంలో రామ్ సహాయ్ జైస్వాల్ నిజం ఒప్పుకోక తప్పలేదు.

ఏప్రిల్ 14న, కార్తీక్ అనే వ్యక్తిని కూడా చంపాలని మద్యంలో బోరాక్స్ కలిపి ఇచ్చాడు. మద్యం తాగడంతో కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడిపై ఎనిమిది హత్యలు, ఒక హత్యాయత్నం కేసులో రామ్‌సహాయ్ జైస్వాల్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

©️ VIL Media Pvt Ltd.