
మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణికులు రుతుస్రావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కీలక ముందుడుగు వేసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ఉచిత శానిటరీ నాప్‌కిన్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్‌తో రైల్వేశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లల్లో 500 శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లను నెలకొల్పింది. ఢిల్లీ, లక్నో, అంబాలా, ఫిరోజ్‌పూర్, మొరాదాబాద్ డివిజన్‌లలోని 175 రైల్వే స్టేషన్లలో ఈ మెషిన్లను ఏర్పాటు చేశారు. ఈ శానిటరీ నాప్‌కిన్‌లు రోజుకు 24 గంటలూ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
మహిళలకు ఊరట..
ఇండస్ టవర్స్ “నారీ సమ్మాన్” అనే సీఎస్ఆర్ కార్యక్రమం కింద ఈ మెషీన్లను ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు 3 కోట్లకుపైగా నాప్‌కిన్‌లు పంపిణీ చేశారు. రైల్వే ప్రయాణాల సమయంలో మహిళలకు శానిటరీ ప్యాడ్‌లు లభించడం లేదు. దీని వల్ల రుతుస్రావం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లలో అందుబాటులో లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నా. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండస్ టవర్స్ తమ CSR కార్యక్రమం “ప్రగతి” కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉన్న “ఋతు పరిశుభ్రత పథకం” లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఈ అత్యాధునిక యంత్రాలు సాంకేతికతతో పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) టెక్నాలజీతో వీటిని అనుసంధానించారు. మెషీన్‌లో శానిటరీ ప్యాడ్‌లు అయిపోకముందే కంట్రోల్ రూమ్‌కు ఒక హెచ్చరిక అందుతుంది. స్టేషన్‌లో అన్ని వేళలా ప్యాడ్‌లు అందుబాటులో ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. యంత్రాల కొరతను నివారించేందుకు ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. రైళ్లల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. వీళ్లల్లో మహిళలు, బాలికలు ఎక్కువమంది ఉంటున్నారు. దీంతో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.
2030 నాటికి..
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రజా రవాణా నెట్‌వర్క్‌లో రైల్వేలు ఒకటి. దీంతో ఇటువంటి సౌకర్యాన్ని అందించడం ఒక పెద్ద బాధ్యత అని ఇండస్ టవర్స్ సంస్థ తెలిపింది. సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అందించడంలో తమ కంపెనీకి విస్తృతమైన అనుభవం ఉందని, ఆ అనుభవాన్ని ఇప్పుడు సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నామని స్పష్టం చేసింది. 2030 నాటికి 15 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొంది.