
- ఓయూకు వెయ్యి కోట్లు ఇస్తామని రూ. వెయ్యి కూడా ఇవ్వలె
- రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు
- విద్యార్థులకు చదువుతోపాటు దేశభక్తి ఉండాలి
- ‘నమో జెన్ జెడ్ కాన్ క్లేవ్’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలాయని, నిరుద్యోగులను, విద్యార్థులను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించి ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్.. కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నమో జెన్ జెడ్ కాన్‌క్లేవ్’ కార్యక్రమంలో రాంచందర్‌రావు మాట్లాడారు. యువత కేవలం ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా బీఏ, బీఎస్సీ వంటి కోర్సులపై కూడా దృష్టి సారించాని సూచించారు. యువత స్వయం ఉపాధి పొంది, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయ చైతన్యం, దేశభక్తి ఉండాలని.. దేశభక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
కొన్ని శక్తులు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రామచందర్ రావు హెచ్చరించారు. నేపాల్ తరహాలో జెన్ జీ యువత రోడ్లపైకి వచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఓ నేత మాట్లాడటం దుర్మార్గమన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాంచందర్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని.. విద్యార్థులు, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జెన్ జీ బ్యాచ్ అన్ని సదుపాయాలతో జన్మించిన జనరేషన్ అని అన్నారు. 2014కు ముందు.. ఆ తర్వాత దేశ నిర్మాణం ఎలా జరిగిందో యూత్ చూసిందని, మోదీ ప్రధాని అయ్యాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు మాట్లాడారు. బీజేవైఎం లీడర్లు గణేశ్, మల్కా యశస్వీ, హరీశ్వర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ సర్కారు ఖాయం!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పోరాట స్ఫూర్తి, పట్టుదలే తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ‘బలిదాన్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ముఖర్జీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు మాట్లాడుతూ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగానికి నిదర్శనమని అన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే భావనను బీజేపీ కార్యకర్తలకు ఆయనే అందించారని చెప్పారు. నాడు ఎల్‌కే అద్వానీ సూచనతోనే తెలంగాణ బీజేపీ కార్యాలయానికి ముఖర్జీ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ పార్టీలు బెంగాల్ అభివృద్ధిని అడ్డుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.