Reading Time: < 1 minute
Diabetes Cases Surge In India After Covid Nfhs 6 Report Reveals Alarming Rise

Diabetes: కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయుల్లో ‘‘మెటాబాలిజం’’ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు పెరగడం సమస్యను పెంచుతున్నాయి. ఊబకాయం, మధుమేహం(డయాబెటిస్) వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) నివేదిక వెల్లడించింది. 2023-24 కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా సుమారు 6.79 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. మణిపూర్ మినహా దేశవ్యాప్తంగా 715 జిల్లాలను సర్వే కవర్ చేసింది.

పురుషుల్లో పెరిగిన షుగర్ వ్యాధి:

15 ఏళ్లకు పైబడిన పురుషుల్లో డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరిగాయి. రక్తంలో చక్కెర స్థాయిలు 141mg/dl కంటే ఎక్కువగా ఉన్నవారిని లేదా డయాబెటిస్ మందులు తీసుకుంటున్నవారిని ఈ గణాంకాల్లో పరిగణించారు. 2019-20 నివేదికలో పురుషుల్లో డయాబెటిస్ 15.6 శాతంగా ఉండగా, NFHS-6లో అది 20.9 శాతానికి పెరిగింది. దేశంలో 15 ఏళ్లకు పూబడిన పురుషులు 56 కోట్ల మంది ఉంటే వీరిలో 11.7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారని వెల్లడైంది. 2021లో ఇది 8.7 కోట్లుగా ఉండేది.

మహిళల్లో కూడా మధుమేహం సమస్య పెరుగుతోంది. NFHS-5లో 13.5 శాతం ఉన్న మధుమేహం, ప్రస్తుతం 17.8 శాతానికి చేరుకుంది. మూడేళ్ల క్రితం 5.4 కోట్ల మంది మహిళలు డయాబెటిస్‌తో బాధపడుతుండగా, ఇప్పుడు ఆసంఖ్య 7.12 కోట్లకు పెరిగింది.

ఊబకాయం మరో సమస్య:

మధుమేహంతో పాటు మధుమేహానికి ప్రారంభ కారణాల్లో ఒకటైన ఊబకాయం కూడా వేగంగా పెరుగుతోంది. 15-49 ఏళ్ల మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 24 శాతం నుంచి 30.7 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 42.8 శాతం మహిళలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25.5 శాతంగా నమోదైంది. పురుషుల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2019-20లో 22.9 శాతం ఉన్న అధిక బరువు, ఊబకాయం రేటు 2023-24లో 27.3 శాతానికి చేరుకుంది. పట్టణాల్లో 36.3 శాతం మంది పురుషులు, గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వే తెలిపింది.