Reading Time: 2 minutes

జూనియర్ లాయర్లకు స్టైపెండ్ ఇవ్వాలి.. లా కోర్స్ కంప్లీట్.. సమస్యలు స్టార్ట్..!

Caption of Image.

న్యాయమే ధ్యేయంగా,  సమాజంలో  బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎంతో మక్కువతో  న్యాయవిద్య పూర్తి చేసి, నల్లకోటు ధరించి కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న యువ న్యాయవాదుల  భవిష్యత్తు  ప్రశ్నార్థకంగా మారుతోంది.  లా కోర్స్ పూర్తికాగానే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న  జూనియర్ అడ్వకేట్లు ప్రస్తుతం తీవ్ర నిరాశ,  నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది  ప్రతిభావంతులైన  యువకులు ఈ వృత్తిని వదిలిపెట్టే  పరిస్థితి  వస్తోంది. 

సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే  దేశవ్యాప్తంగా ఉన్న బార్ సభ్యుల కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ చర్యలను కోరుతూ ఆరుగురు మహిళా న్యాయవాదుల బృందం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యవస్థాగత లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ధర్మాసనం  న్యాయవాద వృత్తి  ప్రారంభ సంవత్సరాల్లో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ  కీలక వ్యాఖ్యలు చేసింది.  

బార్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టే ఒక యువ మొదటి తరం న్యాయవాదికి ఒక కార్యాలయం,  లైబ్రరీ,  స్థిరమైన క్లయింట్లు లేదా ఒక కచ్చితమైన ఆదాయ వనరు వెంటనే వారసత్వంగా  లభించవు.  కుటుంబాలను పోషించే  ప్రధాన సంపాదకులుగా ఉన్న ఎంతోమంది  ప్రతిభావంతులైన యువ న్యాయవాదులు, తమ కుటుంబాలకు అండగా నిలవడం కోసం ఈ వృత్తిని వదిలిపెట్టే పరిస్థితి వస్తోంది.  వారి కనీస జీవనఖర్చులకు కూడా సరిపోవడం లేదు అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు

కేసుల ఫైలింగ్, ఆర్గ్యుమెంట్స్ తదితర లీగల్ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌పై  అవగాహన కోసం సీనియర్ అడ్వకేట్స్ దగ్గర  అనివార్యంగా జాయిన్ అవుతున్న జూనియర్లు దాదాపు ఎలాంటి వేతనం లేకుండానే పనిచేస్తున్నారు.  ఇబ్బడి ముబ్బడి  కేసులతో  ఫీజుల రూపేణా నెలకు లక్షల రూపాయలు  సంపాదించే  కొంతమంది సీనియర్ అడ్వకేట్స్‌‌‌‌‌‌‌‌ సైతం ఏళ్ల తరబడి తమ దగ్గర పనిచేస్తున్న జూనియర్లకు కనీసం రోజువారీ పెట్రోల్ ఖర్చుల మేరకైనా డబ్బులు ఇవ్వకపోవడం గమనార్హం. 

అయితే,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  వంటి మహానగరంలో  మాత్రం  మెజారిటీ  సీనియర్  అడ్వకేట్స్‌‌‌‌‌‌‌‌  జూనియర్ల  పనితీరుని బట్టి నెలకు రూ. 20,000 నుంచి లక్ష రూపాయలకు పైగా శాలరీ చెల్లిస్తున్నారు.  కానీ, జిల్లా, ఇతర కోర్టుల్లో మాత్రం జూనియర్లకు శాలరీ ఇచ్చే సీనియర్లను వేళ్లమీద లెక్కించవచ్చు.  రోజువారీ  ఖర్చుల కోసం,  కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ,  మూడు పదుల వయస్సు దాటినా పైసా సంపాదన లేకపోవడంతో   చాలామంది జూనియర్ అడ్వకేట్స్ పెళ్లి చేసుకోవడానికి  సైతం  వెనుకాడుతున్నారు.  న్యాయవాద వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కుకోలేక,  మరో వృత్తి లేదా ఉద్యోగాన్ని చూసుకోలేక యువ న్యాయవాదులు  దీనంగా బతుకీడుస్తున్నారు.

సుప్రీంకోర్టు పిలుపు!

ఈ ఆందోళనలను పరిష్కరించడానికి యంగ్ లాయర్స్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫండ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది.  ఇది సంబంధిత  హైకోర్టుల ప్రత్యేక నియంత్రణలో లేదా రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులతో  భారత ప్రభుత్వం ఏర్పాటు చేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ పరిధిలో ఉండాలని కూడా స్పష్టం చేసింది. కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు  సుప్రీంకోర్టు చేసిన  సూచనలకు అనుగుణంగా సత్వరం చర్యలు  తీసుకోవాలి.

సీఎం గారూ.. ఆదుకోండి!

యంగ్  లాయర్స్  ప్రొఫెషనల్  అసిస్టెన్స్ ఫండ్ ఏర్పాటు చేసి, ఆచరణలోకి  వచ్చేవరకు జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్ చెల్లించే విషయాన్ని  సీఎం  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  సానుభూతితో పరిశీలించాలి. గత  ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ తన  మేనిఫెస్టోలో నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వారికి నెలకు రూ. 5,000  స్టైపెండ్  చెల్లిస్తామని హామీ  ఇచ్చింది.  ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  ఇన్‌‌‌‌‌‌‌‌కం సోర్స్  లేకుండా  కొత్తగా  వృత్తిలోకి వచ్చే జూనియర్లకు  నెలకు  పదివేల రూపాయల చొప్పున  పదేళ్ల పాటు స్టైపెండ్ ఇచ్చేలా సత్వరం చర్యలు తీసుకోవాలి. 

– మానేటి ప్రతాపరెడ్డి-
 

©️ VIL Media Pvt Ltd.