
- ఆందోల్ నియోజకవర్గ బీఎల్‌ఏల అవగాహన సదస్సు
- హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుగు: బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో భారీగా ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ఆరోపించారు. నేడు ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీ రేపు కాంగ్రెస్ సీట్లను చోరీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ఓటర్లపై దృష్టి పెట్టి, వారి ఓట్లను సర్ పేరిట తొలగిస్తుందన్నారు. మంగళవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగుపేట చౌరస్తాలో బీఎల్ఏలకు శిక్షణ నిర్వహించారు.
మీనాక్షి నటరాజన్‌తోపాటు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, 2028లో ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటినుంచే ఓటరు నమోదుకు సిద్ధమైందన్నారు. సర్ పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని, తన నామినేషన్ తిరస్కరణకు కూడా ఆ పార్టే కారణమని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో 30 లక్షల మంది రైతుల ఓట్లను తొలగించి మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ కుట్ర చేసిందన్నారు.
అదే తరహాలో తెలంగాణలో కూడా సర్ ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని, తెలంగాణను మరో బెంగాల్ కానివ్వమని ఆమె అన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫయిమ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఖేల్ ఖతం: మహేశ్ గౌడ్
తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతమైందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయినదానికి, కానిదానికి బీఆర్ఎస్ అగ్ర నాయకులు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పదేళ్లలో చేసిన నీళ్లు, భూమి, నిధుల దోపిడీ ప్రజలు మర్చిపోలేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ ఎన్నో అరాచకాలు చేస్తోందన్నారు. బీజేపీ పేదల ఓట్లు తొలగించి.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తోందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు తెలంగాణలో ఓటు చోరీ కానివ్వమన్నారు. అందుకే సర్‌పై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బీఎల్ఏలకు సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలన్నారు. సర్‌పై ప్రజా ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన కలిగి ఉండాలన్నారు.