Reading Time: < 1 minute
Rohit Sharma Honored With Padma Shri Award

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల రెండో దశ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల మే నెలలో జరిగిన మొదటి దశ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన 39 ఏళ్ల రోహిత్ శర్మ, ఈ వేడుకకు తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. అవార్డును స్వీకరించడానికి ముందు రోహిత్ ప్రధాని నరేంద్ర మోదీకి అభివాదం చేశారు. ఈ వేడుకలో హాకీ స్టార్ సవితా పునియాకు పద్మశ్రీ, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్ లభించగా, ప్రముఖ నటుడు మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్, ఆంకాలజిస్ట్ దత్తాత్రేయుడు నోరి కూడా పురస్కారాలు అందుకున్నారు.

రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డు అందుకోవడం వెనుక ఒక అరుదైన 19 ఏళ్ల సెంటిమెంట్ దాగి ఉంది. ఆయన సరిగ్గా 19 ఏళ్ల క్రితం, అంటే 2007 జూన్ 23న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తన అరంగేట్రం రోజే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం విశేషం. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిళ్లను గెలుచుకుంది. ప్రస్తుతం టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేలకు పైగా పరుగులు చేసిన రోహిత్ శర్మ, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా, ఓపెనర్‌గా భారత్ తరఫున అత్యధిక పరుగులు (16,137) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. పద్మశ్రీ అవార్డు సాధించడం ద్వారా ఆయన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉన్న ప్రత్యేక క్లబ్‌లో చేరారు. ఇప్పటివరకు దాదాపు 40 మంది భారతీయ క్రికెటర్లకు పద్మశ్రీ పురస్కారం లభించింది.