
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతకుముందు వరుస సెషన్లలో లాభాల బాట పట్టిన మార్కెట్లు, ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 984 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 ఏకంగా 308 పాయింట్లు నష్టపోయింది. ఈ త్రైమాసికంలో నిఫ్టీ మళ్లీ 24,000 మార్కు కంటే దిగువకు పడిపోవడం మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగించింది.
మార్కెట్లు ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆసియా మార్కెట్ల పతనం. అంతర్జాతీయంగా ఆసియా ఈక్విటీ మార్కెట్లలో వ్యక్తమైన భారీ అమ్మకాల ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై తీవ్రంగా పడింది. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (KOSPI) సూచీ ఏకంగా 10 శాతం పడిపోగా, తైవాన్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో బలపడ్డాయి. సెప్టెంబర్ నాటికి వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేశాయి.
ఐటీ, మెటల్ షేర్లలో కుంగుబాటు: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో భారతీయ ఐటీ రంగం తీవ్రంగా నష్టపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం క్షీణించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజాలు నష్టపోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా 3.39 శాతం పడిపోయింది.
దేశీయంగా రుతుపవనాల్లో ప్రస్తుతం 42.2 శాతం భారీ లోటు నమోదైంది. ఒకవేళ ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే, అది ద్రవ్యోల్బణాన్ని పెంచి, గ్రామీణ డిమాండ్‌ను దెబ్బతీస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది.
వీటితో పాటు.. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్, పవర్ గ్రిడ్ వంటి రక్షణాత్మక రంగాలు మాత్రమే స్వల్ప లాభాలతో మార్కెట్‌కు కాస్త అండగా నిలిచాయి.