
వాషింగ్టన్: అమెరికాలో స్థిరపడి, అక్కడి సిటిజన్‌షిప్ పొందాలనుకునే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వం పొందే ప్రక్రియను మరింత ఖరీదైనదిగా మార్చేలా సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేర పెంచాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది.
అప్లికేషన్ల పరిశీలనకు, స్క్రీనింగ్ ప్రక్రియకు అవుతున్న పూర్తి ఖర్చులను దరఖాస్తుదారుల నుంచే వసూలు చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. సోమవారమే డ్రాఫ్ట్ నిబంధనలను ప్రజల అభిప్రాయాల కోసం అధికారికంగా విడుదల చేశారు. ప్రజా అభిప్రాయ సేకరణ కోసం 60 రోజుల సమయం ఇచ్చారని, ఆ తర్వాతే పెరిగిన ఫీజులు అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
పెరగనున్న అప్లికేషన్ ఖర్చు
ఈ తాజా ప్రతిపాదన ప్రకారం.. పౌరసత్వం కోసం చేసే సాధారణ పేపర్ ఫైలింగ్ ఫీజు ప్రస్తుతం ఉన్న 760 డాలర్ల (సుమారు రూ. 64 వేలు) నుంచి ఒకేసారి 1,330 డాలర్లకు (సుమారు రూ.1.11 లక్షలు) పెరగనుంది. అంటే దరఖాస్తు ఖర్చు 570 డాలర్లు (దాదాపు రూ.48 వేలు) పెరగబోతోంది. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, అప్పీల్స్ బోర్డు ముందు పునఃసమీక్ష (రీకన్సిడరేషన్) కోరడానికి అయ్యే ఫీజును కూడా భారీగా పెంచారు.
ప్రస్తుతం 830 డాలర్లుగా ఉన్న అప్పీల్ ఫీజును ఏకంగా 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది దాదాపు 77.7 శాతం పెంపును సూచిస్తోంది. ప్రస్తుత ఫీజులు దరఖాస్తుల ప్రాసెసింగ్ ఖర్చులకు సరిపోవడం లేదని, వలసదారులకు ఇచ్చే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం పౌరసత్వమేనని, అందుకే సర్దుబాటు చేస్తున్నామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్థించుకుంది.
ట్రంప్ నిర్ణయంపై ఆందోళనలు
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై అమెరికాలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫీజుల పెంపు వల్ల ఏటా లక్షలాది మంది చట్టబద్ధమైన శాశ్వత నివాసితులపై (గ్రీన్ కార్డ్ హోల్డర్లు) తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు.
అమెరికా పౌరసత్వం అనేది ఇకపై లగ్జరీగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వాన్ని ప్రోత్సహించడం వల్ల వలసదారులు ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో భాగస్వామ్యం కావడానికి వీలుండేదని, కానీ ఇప్పుడు భారీ ఫీజులు ఆ ఆశయాలను దెబ్బతీస్తాయని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మాజీ అధికారులు పేర్కొన్నారు.