Reading Time: < 1 minute

హైదరాబాద్లో పుంజుకున్న రియల్ ఎస్టేట్.. మేడిపల్లిలో గజం రూ.80 వేలు.. 63 ప్లాట్లను వేలం వేసిన HMDA

Caption of Image.
  • ప్రభుత్వానికి రూ.120 కోట్లు ఆదాయం 
  • కనీస ధర రూ. 45 వేలు పెడితే డబుల్ ఇన్‌‌కమ్‌‌

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. బుధవారం మేడిపల్లి లే ఔట్లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో గరిష్టంగా ఒక గజానికి రూ.80 వేలు పలికి రికార్డు సృష్టించింది. మార్కెట్​ రేటు ప్రకారం ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారిగా అధికారులు తెలిపారు.

హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మేడిపల్లిలో 68 ప్లాట్ల అమ్మకానికి వేలం ఈ–వేలం నిర్వహించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. ఈ వేలంలో కనీస ధర 45 వేల రూపాయలుగా నిర్ణయించారు. 

హెచ్ఎండీఏ ప్లాట్లు అనగానే ప్రజల్లో ఉన్న నమ్మకం, క్లియర్​ టైటిల్స్, వివాదాలు లేని భూములుగా పేరుంది. దీంతో వేలంలో చాలా మంది పోటీ పడినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 68 ప్లాట్లలో కొన్ని 231.66 చ.గ. కాగా.. మరికొన్ని 643.22 చ. గ. ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో వివిధ కారణాల వల్ల 5 ప్లాట్లకు వేలం జరగలేదని అధికారులు తెలిపారు.

మిగిలిన 63 ప్లాట్లకు జరిగిన వేలంలో అత్యధికంగా రూ.80 వేల వరకు ధర పలుకగా, కొన్ని అంతకంటే తక్కువ పలకడంతో యావరేజిగా చదరపు గజానికి 56,260 రూపాయలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం 63 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.120 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూముల వేలం ద్వారా హైదరాబాద్​ నగరంలో రియల్​ఎస్టేట్​పుంజుకుంటున్నదన్న విషయం స్పష్టమైందని అధికారులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.