Reading Time: 2 minutes

చెత్త గుట్టల్లో బాల్యం బందీ.. హైదరాబాద్ జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో పిల్లల విద్య, ఆరోగ్యంపై ఎఫెక్ట్

Caption of Image.
  • అనారోగ్యం, కాలుష్యంతో చదువుకు దూరమవుతున్న చిన్నారులు 
  • 33% మంది చిన్నారులకు శ్వాసకోశ  వ్యాధులు
  • బడికి వెళ్లాలంటే రోజూ 3 కిలోమీటర్ల పైన నడవాల్సిందే
  • ఆర్థిక ఇబ్బందులతో 34 శాతం డ్రాపౌట్లు 
  • 21 శాతం మంది బాల కార్మికులుగా మారుతున్నరు
  • గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: సిటీ నలుమూలల నుంచి వచ్చే వేల టన్నుల చెత్తాచెదారం మధ్య వేలాది మంది చిన్నారుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. పర్యావరణ కాలుష్యం, అధికారుల నిర్లక్ష్యం, భౌగోళిక అడ్డంకులు.. వెరసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్మీ పబ్లిక్ స్కూల్(గోల్కొండ) జాగ్రఫీ ఫ్యాకల్టీ ఎం. కామరాజు ఆధ్వర్యంలో ‘ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అండ్ సొసైటీ’(ఈఎస్ఎస్) ఇంటర్నేషనల్ జర్నల్ కోసం నిర్వహించిన రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లో సిటీ శివారులో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో విద్యార్థుల విద్య, ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

2025 –-26 కాలానికి సంబంధించి సుమారు 150 కుటుంబాల డేటాను విశ్లేషించి రూపొందించిన ఈ రిపోర్ట్… జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో దాగి ఉన్న కొత్త సమస్యలను వెలుగులోకి తెచ్చింది.

పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు… 

జవహర్ నగర్ అంటేనే హైదరాబాద్ సిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన భారీ డంపింగ్ యార్డ్. దాదాపు 350 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యార్డ్‌‌లోకి ప్రతిరోజూ 4,500 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరుతోంది. ఈ చెత్త కుప్పల నుంచి వచ్చే దుర్వాసన, విష వాయువుల మధ్యే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. సర్వే ప్రకారం..41 శాతం ఇళ్లు ఈ డంపింగ్ యార్డ్‌‌కు కిలోమీటరు లోపే ఉన్నాయి. దీనివల్ల గాలి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి.

గాలి నాణ్యత పూర్ కేటగిరీలో ఉందని 63 శాతం మంది బాధితులు మొరపెట్టుకున్నారు. ఈ పర్యావరణ అసమానతే విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రధాన అడ్డంకిగా మారింది. కాలుష్యం వల్ల చిన్నారుల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది. విష వాయువులు పీల్చడం వల్ల 33 శాతం మంది పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. అనారోగ్యం కారణంగా నెలకు కనీసం ఒక్కసారైనా పిల్లలను బడికి పంపలేకపోతున్నామని 57 శాతం కుటుంబాలు వెల్లడించాయి.

బడికి పోవాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సిందే… 

జవహర్ నగర్‌‌‌‌లో ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు లేవని రిపోర్ట్ తేల్చింది. కేవలం 22 శాతం మందికి మాత్రమే కిలోమీటరు లోపు స్కూళ్లు ఉండగా, 30 శాతం మంది విద్యార్థులు ప్రతిరోజూ 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది. సరిగ్గా బస్సులు లేక, ఆటో ఖర్చులు భరించలేక చిన్నారులు కాలినడకనే వెళ్తున్నారు. అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలే ఈ దుస్థితికి ఎక్కువగా బలవుతున్నారు.

అబ్బాయిల గైర్హాజరు 32 శాతంగా ఉంటే, అమ్మాయిల గైర్హాజరు 46 శాతం ఉంది. బాలికల్లో ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్కూళ్లలో కనీస పారిశుధ్య వసతులు లేకపోవడమే. సర్వే చేసిన స్కూళ్లలో కేవలం 43 శాతం బడుల్లో మాత్రమే అమ్మాయిలకు ప్రత్యేక టాయిలెట్స్ ఉన్నాయి. దీనికి తోడు భద్రతా కారణాల దృష్ట్యా తల్లిదండ్రులు కూడా వారిని దూరాన ఉన్న స్కూళ్లకు పంపేందుకు జంకుతున్నారు.

కంపునకు తోడు.. ఆర్థిక ఇబ్బందులుz

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 48,216 మంది జనాభా ఉండగా, అందులో అత్యధికులు వలస కూలీలే ఉండడం గమనార్హం. ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వీరు ఇక్కడ కూలీ, చెత్త ఏరడం వంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరంతా అట్టడుగు వర్గాల వారే కావడంతో వారి ఆర్థిక స్థితిగతులు.. విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెలకు రూ. 10 వేల కంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు 46 శాతం ఉన్నాయి. పది వేల ఆదాయంతో  తిండికే తిప్పలయ్యే పరిస్థితుల్లో.. ఇక్కడి విద్యార్థులకు అక్షరం అందని ద్రాక్షలా మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 34 శాతం మంది పిల్లలు మధ్యలోనే బడి మానేస్తుండగా, 21 శాతం మంది చైల్డ్ లేబర్‌‌‌‌గా మారుతున్నారని రిపోర్ట్ పేర్కొంది.

ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి..

అమర్త్యసేన్ కేపబిలిటీ అప్రోచ్ సిద్ధాంతం ప్రకారం.. ఒక మనిషికి కేవలం అవకాశాలు ఉంటే సరిపోదు, వాటిని ఉపయోగించుకునే సామర్థ్యం ఉండాలి. కానీ జవహర్ నగర్ విద్యార్థులకు కనీస ఆరోగ్యకరమైన వాతావరణమే లేదు. అనారోగ్యం, ఆకలి, కాలుష్యం మధ్య ఉన్న పిల్లలు చదువులో రాణించడం అసాధ్యమని పరిశోధకుడు పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటేటా డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోందని, మున్సిపల్ ప్లానింగ్‌‌లో భాగంగా శివారు ప్రాంతాలను కేవలం చెత్త వేసే ప్రాంతాలుగా చూడకుండా, అక్కడి ప్రజల విద్య, ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని పరిశోధకుడు ఎం. కామరాజు తన రిపోర్టులో ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, బస్తీల్లో విద్యా వసతులను మెరుగుపరచాలని ఈ రీసెర్చ్ ద్వారా డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.