
షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేవాళ్లకు ఒక హెచ్చరిక లాంటి వార్త ఇది. అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్ భారత్‌లో ‘బేర్ మార్కెట్’ (మార్కెట్ పడిపోయే కాలం) మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతమున్న స్థాయి నుండి ఏకంగా 20 శాతం వరకు పతనమయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
సాధారణంగా మార్కెట్ విపరీతంగా పెరిగినప్పుడు లాభాలు కూడా అదే రేంజ్‌లో వస్తాయని అందరూ ఊహిస్తారు. కానీ ఒక దశ దాటాక కంపెనీల ఆదాయాలు తగ్గడం మొదలవుతుంది. అప్పుడు షేర్ల ధరలు చాలా వేగంగా కిందకి పడిపోతాయి. ప్రస్తుతానికి మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే మంచి షేర్లు కనుక్కోవడం కష్టంగా మారిందని మార్క్ ఫేబర్ అభిప్రాయపడ్డారు.
భారత మార్కెట్ ఇంతలా పడిపోవడానికి నిపుణులు చెప్తున్న 4 ప్రధాన కారణాలు ఇవే:
1. విదేశీ ఇన్వెస్టర్ల విరమణ (FII Selling)
మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్న మాట నిజమే అయిన.. విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) మాత్రం మన మార్కెట్ నుండి పెద్ద ఎత్తున డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. గత ఏడాది (2025) తో పోలిస్తే, ఈ 2026 మొదటి ఐదు నెలల్లోనే విదేశీ పెట్టుబడిదారులు మన దేశ షేర్లను భారీగా అమ్మేసి దాదాపు 49 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు.
2. మితిమీరిన ధరలు (High Valuations)
ప్రస్తుతం భారతీయ కంపెనీల షేర్ల ధరలు వాటి అసలు సంపాదన కంటే చాలా రెట్లు ఎక్కువ ధర పలికే వాల్యుయేషన్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ‘అంబిట్ క్యాపిటల్’, ‘నువామా’ వంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉందనే చెప్తున్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి కంటే షేర్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా కొనుగోళ్లు చేయడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
►ALSO READ | సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ మూసివేత : AI దెబ్బతో శాంసంగ్ తో సహా ఐటీ షేర్లు కుప్పకూలాయి
3. అంతర్జాతీయ ఉద్రిక్తతలు & క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు అనుకున్నట్లు సాగకపోవడంతో అంతర్జాతీయంగా టెన్షన్లు మళ్లీ పెరిగాయి. దీనివల్ల ముడి చమురు (బ్రెంట్ క్రూడాయిల్) ధర బ్యారెల్‌కు 80 డాలర్ల పైకి చేరింది. ఒకవేళ చమురు ధర గనుక 85 డాలర్లు దాటితే మన మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని ‘ఎంకే గ్లోబల్’ అనే సంస్థ హెచ్చరించింది.
4. వర్షాలు ఆలస్యం కావడం
మన దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు వర్షాలు చాలా ముఖ్యం. అయితే ఈసారి రుతుపవనాలు మూడు వారాలు ఆలస్యంగా రావడం కూడా మార్కెట్‌కు ఒక పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.
నిపుణుల సలహా ఏంటంటే
మార్కెట్ పతనం గురించి భయాలు ఉన్న.. కొందరు విశ్లేషకులు దీన్ని ఒక అవకాశంగా కూడా చూస్తున్నారు. ‘బార్క్లేస్’, ‘PL క్యాపిటల్’ వంటి సంస్థల ప్రకారం… భౌగోళిక రాజకీయ సమస్యలు, ప్రపంచవ్యాప్త ఏఐ (AI) ఉన్మాదం, వర్షాల కొరత వంటి రిస్కులు ఉన్నప్పటికీ, మార్కెట్ కిందకి పడిపోతే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు తక్కువ ధరల్లో మంచి షేర్లు కొనుక్కోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. ముఖ్యంగా డిఫెన్స్ (రక్షణ రంగం), BFSI (బ్యాంకింగ్ & ఫైనాన్స్) రంగాలపై నిపుణులు సానుకూలంగా ఉన్నారు.