Reading Time: 2 minutes
Iaf Tender Confirms 36 Rafale Jets Safe Pakistan Claims Busted

IAF Masterstroke: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసిన బూటకపు ప్రచారాలు మరోసారి బట్టబయలయ్యాయి. భారత రక్షణ శాఖ (IAF) హెడ్‌క్వార్టర్స్ నుంచి విడుదలైన ఒక అధికారిక డాక్యుమెంట్ పాకిస్థాన్ అల్లిన కట్టుకథలను పూర్తిగా తిప్పికొట్టింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అన్ని (36 కి 36) రాఫెల్ విమానాలు ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, ఆపరేషనల్ స్థితిలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌కు ఈ దెబ్బతో దెయ్యం వదిలినట్లు అయ్యిందని చెబుతున్నారు.

ఒక్క టెండర్ పత్రంతో పాక్ ఆటకట్టు..

* జూన్ 15, 2026న ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ‘డైరెక్టరేట్ ఆఫ్ ఇంజినీరింగ్ (రాఫెల్)’ విభాగం.. ఫ్రాన్స్‌కు చెందిన ‘శాఫ్రన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్’ కంపెనీకి ఒక కీలకమైన ‘బ్రిడ్జ్ సపోర్ట్’ ప్రతిపాదనను (RFP – టెండర్) పంపింది.

* 2016 భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వ ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన మొత్తం 36 రాఫెల్ విమానాలు ప్రస్తుతం భారత వాయుసేనలో సేవలందిస్తున్నాయి.

* సెప్టెంబర్ 2026 తర్వాత కూడా ఈ విమానాల నిర్వహణ, సాంకేతిక సహాయం కోసం ఐఏఎఫ్ ఈ టెండర్ జారీ చేసింది.

* రాబోయే ఐదు నెలల కాలానికి గాను, మొత్తం 36 విమానాల ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకేజీని తయారు చేసినట్లు చెబుతున్నారు.

* పాకిస్థాన్ ఆర్మీ, అక్కడి మీడియా, సోషల్ మీడియా వేదికలలో భారత్‌కు చెందిన కనీసం మూడు రాఫెల్ విమానాలను కూల్చేశామని చేసిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఈ అధికారిక నివేదిక ద్వారా తేలిపోయింది.

టెండర్ డాక్యుమెంట్‌లో కీలక అంశాలు ఇవే..

ఈ బ్రిడ్జ్ పీరియడ్‌లో ఒక్కో రాఫెల్ విమానం ఏడాదికి సగటున 150 గంటల పాటు ఎగిరేలా ప్లాన్ చేశారు. అంటే ఐదు నెలల్లో మొత్తం బెడె అంతా కలిసి 2,250 గంటలు ప్రయాణించేలా అంచనాలు వేశారు. సెప్టెంబర్ 18, 2026తో రాఫెల్ పాత కాంట్రాక్ట్ ముగియనుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి అంతరాయం లేకుండా విమానాలు పనిచేసేందుకు ఈ కొత్త సపోర్ట్ కాంట్రాక్ట్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి మెయింటెనెన్స్ కాంట్రాక్టులు వాయుసేన వద్ద ఉన్న అసలు విమానాల సంఖ్య ఆధారంగానే జరుగుతాయి. ఇందులో 36 విమానాల గురించి స్పష్టంగా పేర్కొనడంతో పాక్ ప్రచారం అట్టర్ ఫ్లాప్ అని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. రాఫెల్ విమానాలకు ‘M88’ ఇంజన్లను సరఫరా చేసే ఒరిజినల్ కంపెనీ ‘శాఫ్రన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్’ కావడంతో భారత్ నేరుగా ఆ సంస్థకే ఈ ప్రతిపాదనలు పంపింది. గతంలో భారత మహిళా పైలట్‌ను పట్టుకున్నామంటూ పాక్ చేసిన ప్రకటనలను ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇప్పటికే కట్టుకథలుగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.