
మనిషివా మృగానివా నువ్వు.. అసలు నువ్వు తింటుంది అన్నమా పెంటనా రా.. ఢిల్లీలో జరిగిన ఘోరం తెలిస్తే.. మీరు ఇంత కంటే పెద్ద మాటలే అంటారు. 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక ఎక్కడ ఈ విషయం బయటకు చెబుతుందో అన్న భయంతో.. నన్ను ఎవరూ గుర్తు పట్టకూడదు అన్న ఉద్దేశంతో.. ఆ 10 ఏళ్ల బాలికను రాళ్లతో కొట్టాడు.. అత్యంత తీవ్రంగా గాయపరిచాడు. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక ఆరోగ్యం విషమంగా ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు అందర్నీ కలిచి వేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆ కుటుంబం కొన్ని నెలల క్రితమే ఓ రాష్ట్రం నుండి ఢిల్లీకి వలస వచ్చింది. కానీ, విధి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అద్దె కట్టలేక ఫుట్‌పాత్‌నే ఇల్లుగా మార్చుకున్న ఆ పేద తండ్రికి, తన కళ్ల ముందే కూతురు దూరమవుతుందని ఊహించలేకపోయాడు. దక్షిణ ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఒక క్యాబ్ డ్రైవర్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసి, ఆపై రాళ్లతో కొట్టి హత్యా చేశాడు.
“నాన్నా…” అనే ఆ ఒక్క పిలుపే చివరిదైంది
ఆసుపత్రి మార్చురీ బయట ఆ తండ్రి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఆ కన్నతండ్రి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ నరకాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా ఆవేదన చెందాడు…
“మేమంతా ఫుట్‌పాత్‌పై పడుకుని ఉన్నాము. అకస్మాత్తుగా తెల్లవారుజామున ‘నాన్నా…’ అని నా కూతురు గట్టిగా అరిచిన పిలుపు విని ఉలిక్కిపడి లేచాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఒకడు నా బిడ్డను బలవంతంగా కారులోకి లాక్కువెళ్తున్నాడు. నేను వెంటనే ఒక కర్ర తీసుకుని, ఆ కారు వెనుక పరుగెత్తాను. కానీ, ఆ డ్రైవర్ క్షణాల్లో కారును వేగంగా పోనిచ్చాడు. నా కళ్ల ముందే నా బిడ్డను తీసుకెళ్లిపోయారు. నేను ఏమీ చేయలేకపోయాను…” అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.
చదువుకోవాలనే ఆశలన్నీ అడియాసలయ్యాయి..
ఆ పదేళ్ల చిన్నారి ఎంతో బాధ్యతగల పిల్ల. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే, ఇంట్లో తన చిన్న తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆమే దగ్గరుండి చూసుకునేది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమెకు చదువుకోవాలనే కోరిక చాలా ఎక్కువ.
“ఢిల్లీకి వచ్చిన కొత్తలో నా దగ్గర సరైన పేపర్స్ లేవు. ఎంతో కష్టపడి, అన్నీ సమకూర్చుకుని ఇక్కడి ప్రభుత్వ స్కూల్లో నా కూతురిని చేర్పించాను. ఎంతో ఇష్టంగా స్కూల్‌కి వెళ్లేది. బాగా చదువుకోవాలని ఆశపడింది. కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది” అని ఆ తండ్రి ఆవేదనతో చెప్పాడు.
నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు 25 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బసు కుమార్ సింగ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ సరిహద్దుకు సమీపంలోని ఒక నిర్మానుష్య అటవీ ప్రాంతంలో బాలికపై దాడి చేసి, గొంతు నులిమి, రాళ్లతో కొట్టి చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. సోమవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, కేసు దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని తిరిగి పరిశీలించడానికి (సీన్ రీ-కన్స్ట్రక్షన్) నిందితుడిని తీసుకువెళ్లినప్పుడు, అతను పోలీసుల నుంచి ఆయుధాన్ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలిక గాయమైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
రోడ్డు పక్కన బతుకులకు రక్షణ ఏది?
ఈ ఘటన జరిగిన ఫుట్‌పాత్‌పై ఇప్పటికీ ఎంతో మంది నిరాశ్రయులు తాత్కాలిక గుడిసెల్లో జీవిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఒక సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ… రాత్రి పూట తాగుబోతులు, తిరుగుబోతులు ఇక్కడ తిరుగుతూ రోడ్డు పక్కన ఉండే మహిళలను, పిల్లలను వేధిస్తుంటారని, ఈ ప్రాంతం అస్సలు సురక్షితం కాదని చెప్పాడు. ఒక వైపు పేదరికం, మరోవైపు రక్షణ లేని బతుకులు… చివరికి ఒక పదేళ్ల చిన్నారి చదువుకోవాలనే కలలు కన్న నగరంలోనే దారుణంగా బలైపోయింది.