Reading Time: 2 minutes
Bill Gates Admits Extramarital Affairs Claims Jeffrey Epstein Tried To Blackmail Him

Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు (ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్) ఉన్నట్లు స్వయంగా అంగీకరించారు. అయితే, ప్రముఖ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఈ విషయాలను అడ్డుపెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి కుట్ర పన్నాడని గేట్స్ ఆరోపించారు. లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్ నెట్‌వర్క్, అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై విచారణ జరుపుతున్న ‘యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ’ నివేదిక ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన కొన్ని కొత్త పత్రాల ఆధారంగా, ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న పాత సంబంధాలపై మళ్లీ విచారణ ప్రారంభమైంది. ఈ దర్యాప్తులో భాగంగా జూన్ 10న బిల్ గేట్స్ స్వయంగా కమిటీ ముందు హాజరై తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయించారు. ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు ఉన్న సంబంధాల గురించి ఎప్‌స్టీన్‌కు పూర్తిగా తెలుసని ఈ సందర్భంగా గేట్స్ కమిటీకి వివరించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ క్రీడాకారిణి మిలా అంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మాతులీనాలతో పాటు మెడికల్ ఇండస్ట్రియలిస్ట్ అలిస్ జాకబ్స్ నెసెల్రోడ్‌తోనూ తనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గేట్స్ ధృవీకరించారు.

కమిటీ విడుదల చేసిన టెస్టిమోనీ ట్రాన్స్‌క్రిప్ట్ ప్రకారం బిల్ గేట్స్ మాట్లాడుతూ.. “ఈ అఫైర్స్‌కు, ఎప్‌స్టీన్‌తో నేను జరిపిన సంభాషణలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ విషయాలు నా కుటుంబానికి ఎంతో మానసిక వేదనను మిగిల్చాయి. నేను చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని, కొన్ని అబద్ధాలను కూడా జోడించి, తనతో మళ్లీ సంబంధాలు కొనసాగించేలా ఎప్‌స్టీన్ నాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాడు” అని పేర్కొన్నారు. అయితే, ఎప్‌స్టీన్ పాల్పడిన ఎలాంటి నేరాల్లోనూ తనకు భాగస్వామ్యం లేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, అతనితో పరిచయం పెంచుకోవడం తాను చేసిన అతిపెద్ద తప్పు అని అంగీకరించారు. కేవలం సామాజిక సేవా కార్యక్రమాల (ఫిలాంత్రోపీ) గురించి చర్చించడానికే తాను ఎప్‌స్టీన్‌ను కలిసేవాడినని చెప్పారు. “అతను నేరస్థుడని నాకు తెలుసు. అయినప్పటికీ ఒక పరిమిత పరిధిలో అతన్ని కలిసే రిస్క్ తీసుకున్నాను” అని గేట్స్ తెలిపారు. ఎప్‌స్టీన్ తన వ్యక్తిగత విషయాలను వాడుకుని బ్లాక్‌మెయిల్ చేయాలని ఆలోచించినట్లు కొన్ని ఈమెయిల్స్ ద్వారా స్పష్టమవుతోందని, అయితే నేరుగా తనేం తనను బ్లాక్‌మెయిల్ చేయలేదని బిల్ గేట్స్ కమిటీ ముందు వెల్లడించారు.