
ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడుతున్న చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాలకు గురవుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి గేమ్స్ కారణంగా సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఇటీవల తమ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయ్యాయని భావిస్తూ పలువురు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ, విచారణలో అసలు విషయం బయటపడుతోందన్నారు. పిల్లలే గేమ్‌లలో వర్చువల్ కాయిన్స్, డైమండ్లు కొనుగోలు చేసేందుకు ఫోన్లలో సేవ్ చేసిన బ్యాంకు కార్డులు, యూపీఐ వివరాలను వినియోగిస్తున్నట్లు తేలుతోందని చెప్పారు. ముఖ్యంగా పెద్దల ఫోన్లలో బ్యాంకింగ్ యాప్‌లు లాగిన్‌లో ఉండటం వల్ల వేల రూపాయలు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల చోటుచేసుకున్న మైనర్ బాలికల అదృశ్యం ఘటనలు కూడా ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను బయటపెడుతున్నాయని సీపీ తెలిపారు. ‘ఫ్రీ ఫైర్’ ద్వారా అపరిచితులతో పరిచయం పెంచుకున్న కొందరు బాలికలు, అనంతరం సోషల్ మీడియా ద్వారా వారితో సన్నిహితంగా మారి ఇళ్లను వదిలి వెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారని వివరించారు. ప్రస్తుతం 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల్లో గేమింగ్ వ్యసనం వేగంగా పెరుగుతోందని సజ్జనర్ ఆందోళన వ్యక్తం చేశారు. గేమ్‌లలో రేర్ ఐటమ్స్, ఆయుధాలు, ఎలైట్ పాస్‌ల కోసం స్నేహితుల మధ్య పోటీ పెరగడంతో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఆన్‌లైన్ తరగతుల కోసం అందించిన మొబైల్ ఫోన్లు ఇప్పుడు గంటల తరబడి సాగే గేమింగ్‌కు వేదికలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
అతిగా గేమ్స్ ఆడటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గేమింగ్ డిజార్డర్’గా గుర్తించిందని గుర్తుచేసిన సీపీ, దీనివల్ల పిల్లల్లో కోపం, దూకుడు, నిద్రలేమి, చదువుపై నిర్లక్ష్యం, సామాజిక దూరం వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే గేమ్‌లను పూర్తిగా నిషేధించడం కంటే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడటం, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమయ పరిమితులు విధించడం వంటి చర్యలు మరింత ఫలితాలిస్తాయని సూచించారు.
పిల్లలు ఉపయోగించే ఫోన్లలో సేవ్ చేసిన బ్యాంకు కార్డులు, యూపీఐ వివరాలను తొలగించాలని, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ భద్రత తప్పనిసరి చేయాలని సజ్జనర్ సూచించారు. అలాగే పేరంటల్ కంట్రోల్స్‌ను వినియోగిస్తూ పిల్లల డిజిటల్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ‘మానిటర్, మెంటర్, మోటివేట్’ అనే త్రిసూత్రాన్ని పాటిస్తూ పిల్లలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..