
హైదరాబాద్, వెలుగు: పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గత నాలుగేండ్లుగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రూ. 8,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.ఈ మేరకు మంగళవారం ప్రజా భవన్‌లో బీసీ నేత విక్రమ్ గౌడ్‌తో ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని గుర్తుచేశారు. 2008లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రస్తుత జీవో నెంబర్ 8, 9 లను తక్షణమే రద్దు చేయాలన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేల లోపు ర్యాంకు రావాలనే నిబంధనను ఎత్తివేసి, అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని సూచించారు. బీసీ నేతల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఫీజు బకాయిల చెల్లింపులపై రెండు, మూడు రోజుల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.