Reading Time: 2 minutes
ఒక్క జీన్స్ ప్యాంట్ తయారీ వెనుక 10వేల లీటర్ల నీళ్లా.. ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎప్పటికీ ట్రెండ్ మారని ఏకైక వస్త్రం జీన్స్. కానీ కేవలం ఒక్క ఫ్యాషనబుల్ జీన్స్ ప్యాంటు తయారీకి సగటున 7,000 నుండి 10,000 లీటర్ల నీరు ఖర్చవుతుందని ఐక్యరాజ్యసమితి నివేదికలతో సహా పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నీటి పరిమాణం ఎంత పెద్దదంటే.. ఒక సాధారణ మనిషి రోజుకు సగటున 3 లీటర్ల నీరు తాగితే ఆ నీటితో సుమారు 9 సంవత్సరాల పాటు తన దాహాన్ని తీర్చుకోవచ్చు. ఒక జత జీన్స్ తయారు చేయడానికి దాదాపు 800 గ్రాముల నుండి ఒక కిలోగ్రాము ముడి పత్తి అవసరమవుతుంది. అయితే పొలం నుండి కేవలం ఒక్క కిలో పత్తిని పండించడానికే రైతులు దాదాపు 10,000 లీటర్ల నీటిని వాడాల్సి వస్తుంది. అంటే, జీన్స్ తయారీలో సగానికి పైగా నీరు కేవలం పొలాల్లోనే ఖర్చయిపోతుంది. మధ్య ఆసియాలోని ఒకప్పటి ప్రపంచ నాల్గవ అతిపెద్ద సరస్సు అయిన అరల్ సముద్రం నేడు పూర్తిగా ఎండిపోయి ఎడారిగా మారడానికి, దాని పరివాహక ప్రాంతాల్లో మితిమీరిన పత్తి సాగు కోసం నీటిని తరలించడమే ప్రధాన కారణమనే వాదనలు ఉన్నాయి.

15 నుండి 20 సార్లు రంగుల స్నానం

పత్తి నుండి నూలు తీసి, డెనిమ్ క్లాత్ నేసిన తర్వాత దానికి మనకు నచ్చిన ముదురు నీలం రంగు తీసుకురావడానికి ప్రత్యేక రసాయన రంగులను ఉపయోగిస్తారు. ఆ రంగు వస్త్రానికి పర్ఫెక్ట్‌గా పట్టేలా చేయడం కోసం బట్టను రంగు ద్రావణంలో ముంచి, ఆరబెట్టే ప్రక్రియను 15 నుండి 20 సార్లు రిపీట్ చేస్తారు. ఈ రంగుల వేటలోనే వందల లీటర్ల స్వచ్ఛమైన నీరు వృధా అవుతుంది.

నదులను ముంచేస్తున్న వ్యర్థాలు

మనం మార్కెట్లో చూసే లేత రంగు, గీతలు పడినట్లు ఉండే స్టోన్ వాష్ లేదా ఫేడెడ్ జీన్స్ స్ట్రక్చర్ కోసం ఫ్యాక్టరీలలో భయంకరమైన రసాయనాలతో కెమికల్ వాష్ చేస్తారు. ఈ రసాయనాలు పోయి బట్ట మెత్తగా అవ్వడం కోసం మళ్లీ పదే పదే టన్నుల కొద్దీ స్వచ్ఛమైన నీటితో కడుగుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడే విషపూరిత రసాయన వ్యర్థ జలాలు నేరుగా నదులు, చెరువుల్లో కలిసి జలచరాలను చంపేస్తూ, భూగర్భ జలాలను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి.

మనవంతుగా ఏం చేయవచ్చు?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్దీ జీన్స్ జతలు ఉత్పత్తి అవుతూ భూమిపై నీటి సంక్షోభాన్ని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుత డిజిటల్ కాలంలో అనేక అంతర్జాతీయ బ్రాండ్లు నీటిని 90శాతం వరకు ఆదా చేసే లేజర్ టెక్నాలజీ, ఓజోన్ వాషింగ్, వాడిన నీటిని శుద్ధి చేసే పద్ధతులను వాడుతున్నాయి.