
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల లెక్కింపు (హుండీ లెక్కింపు) ముగిసింది. కేవలం 40 రోజుల్లోనే ఆలయ హుండీ ద్వారా ముక్కంటికి రికార్డు స్థాయిలో రూ. 2 కోట్ల 69 లక్షల 39 వేల 190 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి ఇంకా ఆల్‌టైమ్ రికార్డు.
వేసవి సెలవుల్లో పెరిగిన భక్త జనం
ఈ సందర్భంగా ఆలయ ఈఓ వెంకటేశులు మాట్లాడుతూ.. స్వామి, అమ్మవార్ల కృపతో ఈ ఏడాది వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ బాగా పెరిగిందని చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల వల్లే ఈ రికార్డు స్థాయి ఆదాయం సాధ్యమైందని ఆయన వివరించారు.
ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు.
►ALSO READ | తిరుమలలో భారీ మోసం.. సుప్రభాత సేవ పేరుతో 60 మందిని దోచుకున్న దళారులు
లెక్కింపులో పాల్గొన్న అధికారులు
హుండీ లెక్కింపు ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి, తిరుపతి జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఫణీంద్ర, డిప్యూటి ఈఓ కృష్ణారెడ్డితో పాటు బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది సహా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
ఈ దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా హుండీ ఆదాయం రావడం పట్ల ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.