Reading Time: 2 minutes
Watch: రోడ్డుపై పోలీసుల సడెన్ చెకింగ్‌.. ఓ స్కూటీని ఆపి చెక్‌ చేయగా షాకింగ్‌ సీన్‌

హైదరాబాద్, జూన్ 23: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో మరోసారి గంజాయి దొరికింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ ప్రాంతంలో జరిగిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. స్థానికంగా ఉన్న AMD ఫంక్షన్ హాల్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక యాక్టివా స్కూటర్‌ను ఆపి తనిఖీ చేశారు. వాహనాన్ని ఆపిన వెంటనే డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం కలగడంతో సమగ్రంగా తనిఖీ చేశారు. యాక్టివాలో దాచిపెట్టిన సుమారు ఒక కిలో మూడు వందల గ్రాముల గంజాయి బయటపడింది. మాదకద్రవ్యాలను ప్యాకెట్ల రూపంలో జాగ్రత్తగా దాచి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ మార్గం ద్వారా హైదరాబాద్‌కు చేరింది? అలాగే దీన్ని ఎవరికి సరఫరా చేయాలని ఉద్దేశించారనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారన్న విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ సరఫరా చైన్‌ను అడ్డుకునేందుకు తరచూ వాహన తనిఖీలు, సడెన్ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ చర్యల భాగంగానే షాహీన్ నగర్ ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని సున్నిత ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇటువంటి డ్రైవ్‌లు మరింత కఠినంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ SHO ఎం. సుధాకర్, అడ్మిన్ ఎస్‌ఐ సుధాకర్‌తో పాటు పోలీస్ సిబ్బంది, క్రైమ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. సమన్వయంతో నిర్వహించిన ఈ తనిఖీల వల్ల పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. మాదకద్రవ్యాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగుతుందని, ఇలాంటి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

గండిపేటలో కలకలం.. హెరాయిన్ తో అడ్డంగా దొరికిపోయాడు

హైదరాబాద్‌ గండిపేటలో డ్రగ్స్ విక్రయాలపై ఎస్‌టీఎఫ్, క్రైమ్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో హెరాయిన్ పట్టుబడింది. ఖానాపూర్ లేబర్ కాలనీ ప్రాంతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గండిపేట పరిధిలోని ఖానాపూర్ లేబర్ కాలనీలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్ బృందం, సిటీ క్రైమ్ టీమ్ కలిసి పక్కా ప్రణాళికతో తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అతన్ని ఆపి తనిఖీ చేయగా డ్రగ్స్‌ దొరికాయి. ఆ వ్యక్తిని రింకు ఎస్.కె గా గుర్తించారు. తనిఖీల్లో రింకు నుంచి సుమారు 3.950 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను ఈ మాదకద్రవ్యాలను కోల్‌కతా ప్రాంతం నుంచి తెప్పిస్తున్నట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

అక్కడి నుంచి తక్కువ మొత్తంలో తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడా లేదా పెద్ద నెట్‌వర్క్‌కు లింక్ ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గండిపేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ కేసులు ఎక్సైజ్ శాఖ పరిధిలోకి రావడంతో అక్కడి అధికారులు కేసును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి బ్యాక్‌గ్రౌండ్, డ్రగ్స్ సరఫరా చైన్, అతనికి సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. గండిపేట ప్రాంతంలో డ్రగ్స్ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా లేదా విక్రయాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.