Reading Time: 3 minutes

తెలంగాణ ఆర్థిక గమనానికి అవసరం.. రంగాల సమతుల్యత–సంక్షేమ హేతుబద్ధత

Caption of Image.

గత దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన ఆర్థికవృద్ధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  ఐటీ, ఫార్మా, సేవా రంగాల్లో  హైదరాబాద్ సాధించిన ప్రగతి రాష్ట్రాన్ని ఆదాయ వృద్ధిలో అగ్రగామిగా నిలిపింది. అయితే, నాణేనికి ఒకవైపు  మెరుపులు కనిపిస్తున్నా,  మరోవైపు  రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 సంక్షేమ పథకాల జోరు, పెరుగుతున్న అప్పుల భారం,  మందగిస్తున్న మూలధన వ్యయం  ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తును ఒక కీలకమైన అంచున నిలబెట్టాయి.  ఏదైనా ఒక రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిజమైన బలాన్ని అంచనా వేయాలంటే కేవలం పైపైన కనిపించే గణాంకాలు లేదా జీఎస్‌‌‌‌‌‌‌‌డీపీ  వృద్ధిరేటు మాత్రమే సరిపోవు. ఆ వృద్ధి వెనుక ఉన్న నిర్ధిష్ట రంగాల ప్రాథమిక (వ్యవసాయ), ద్వితీయ (పారిశ్రామిక), తృతీయ (సేవా) రంగాల నిర్మాణాత్మక పురోగతిని లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది.

ఆర్థిక  వ్యవస్థకు  ప్రధాన చోదక శక్తి సేవారంగం. తెలంగాణ ఆర్థికవృద్ధిలో సింహభాగం తృతీయ లేదా సేవా రంగానిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 60% కంటే  ఎక్కువ వాటా ఈ రంగం నుంచే వస్తుంది.  హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఐటీ ఎగుమతులు,  గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు,  బ్యాంకింగ్,  ఫైనాన్షియల్ సేవలు రాష్ట్రాన్ని  ప్రపంచ పటంలో నిలిపాయి. ఈ రంగం సాధించిన వృద్ధి అంతా ఒకే నగరానికి (హైదరాబాద్) పరిమితం కావడం ప్రధాన లోపం. ఐటీ, అనుబంధ సేవలను  టైర్-2  నగరాలైన  వరంగల్,  కరీంనగర్,  ఖమ్మం వంటి ప్రాంతాలకు విస్తరించినప్పుడే నిజమైన వికేంద్రీకృత వృద్ధి సాధ్యమవుతుంది.

పారిశ్రామిక రంగం ఉపాధి కల్పనలో కీలకం

రాష్ట్ర స్థిరమైన వృద్ధికి,  శ్రామిక శక్తికి నాణ్యమైన ఉపాధి కల్పించడంలో ద్వితీయ రంగం పాత్ర అనన్య సామాన్యం. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్,  ఏరోస్పేస్  రంగాలలో  తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించింది. పెద్ద పరిశ్రమలు రాష్ట్రాన్ని  గ్లోబల్ లీగ్‌‌‌‌‌‌‌‌లో  నిలిపితే,  స్థానిక ఆర్థిక వ్యవస్థను నడిపించేది  చిన్న, మధ్య తరహా పరిశ్రమలే.  ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ వ్యయం తగ్గడం వల్ల కొత్త పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం మందగించే  ప్రమాదం ఉంది.  పారిశ్రామిక రంగానికి  నిరంతర విద్యుత్, రాయితీలు సకాలంలో అందితేనే అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తాయి.

జీవనాధార ఇంధనం వ్యవసాయ రంగం

జీఎస్‌‌‌‌‌‌‌‌డీపీలో వ్యవసాయ రంగం వాటా సేవా రంగంతో  పోలిస్తే తక్కువే  అయినప్పటికీ,  రాష్ట్రంలో  సగానికి పైగా  జనాభాకు  ఇదే  ప్రధాన జీవనాధారం.  సాగునీటి  ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్  సరఫరా వల్ల  గత   కొన్నేళ్లలో సాగు విస్తీర్ణం,  ధాన్యపు దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగాయి.  తెలంగాణ ‘రైస్ బౌల్’గా  మారినప్పటికీ, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కావడం సమస్యగా మారింది.  పండిన పంటను అలాగే  అమ్మడం వల్ల రైతుకు ఆశించిన లాభం రాదు.  ప్రతి జిల్లాలో ఆగ్రో- ప్రాసెసింగ్ (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమలను నెలకొల్పి,  వ్యవసాయాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానించడమే  దీనికి  ఏకైక పరిష్కారం.

 రాజకీయ లబ్ధి  వర్సెస్  ప్రజా శ్రేయస్సు

ప్రస్తుత దేశీయ,  రాష్ట్ర రాజకీయాల్లో  ‘ఉచిత పథకాలు’  ఓటర్లను ఆకర్షించే ప్రధాన ఆయుధాలుగా మారాయి.  అయితే,  అవసరమైన సామాజిక సంక్షేమానికి,  ఓట్ల కోసమిచ్చే ఉచితాలకు మధ్య ఉన్న  లక్ష్మణ రేఖను  గుర్తించాల్సిన సమయం  ఆసన్నమైంది.  సంక్షేమ పథకాలు సార్వత్రికం  కాకూడదు. ఆర్థికంగా బాగా స్థిరపడినవారికి, ఆదాయపు పన్ను చెల్లించేవారికి, పెద్ద ఎత్తున భూములు ఉన్నవారికి ఉచితాలను మినహాయించాలి.  

నిజమైన పేదలు, వెనుకబడిన వర్గాలకే  పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది,  ఖజానాకూ భారం తగ్గుతుంది.  జీఎస్టీ లీకేజీలను అరికట్టడం,  మైనింగ్,  రిజిస్ట్రేషన్ల రంగాల్లో పారదర్శకత పెంచడం ద్వారా రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్ని  మరింత పెంచుకోవాలి.  కేవలం ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప, పేదరికం శాశ్వతంగా పోదు.  ఆ నిధులను నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం,  నైపుణ్యాభివృద్ధి  శిక్షణకు మళ్లించాలి.  

ప్రజలను  యాచకులుగా  కాకుండా  ఉత్పాదక శక్తులుగా మార్చడమే నిజమైన సంక్షేమం.  ఏ కొత్త పథకాన్ని తెచ్చినా,  దానికి అయ్యే వ్యయం ఎంత?  దానివల్ల  రాష్ట్ర ఆర్థికస్థితిపై పడే ప్రభావం ఎంత? అనే అంశాలపై నిపుణులతో  ముందే ‘ఫిస్కల్ ఇంపాక్ట్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్’ చేయించి, శాసనసభలో  చర్చించే  సంప్రదాయాన్ని తీసుకురావాలి.

అప్పుల ఊబి- హేతుబద్ధత లేని వ్యయం

ఆర్థిక వృద్ధి  రేటు బాగున్నప్పటికీ, లోపలి  గణాంకాలు ఆందోళన  కలిగిస్తున్నాయి.  రాష్ట్రం ఎదుర్కొంటున్న  ప్రధాన సవాళ్లు ఇవే.  పెరుగుతున్న అప్పుల భారం ఆందోళన కలిగిస్తోంది.  గత  కొన్నేళ్లుగా  చేసిన  బహిరంగ  మార్కెట్  రుణాలు,  బడ్జెట్  వెలుపలి రుణాలు  రాష్ట్ర ఖజానాపై  తీవ్ర ఒత్తిడిని  తెస్తున్నాయి.  ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో  సింహభాగం  కేవలం వడ్డీలు,  పాత అప్పుల అసలు చెల్లింపులకే  సరిపోతుండటం ప్రమాదకరం.  ఇటీవలి కాలంలో ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారుతున్నాయి.  ఆదాయంలో  ఎక్కువ భాగం ఉచిత పథకాలు,  జీతాలు,  పెన్షన్లకే  ఖర్చవుతుండటంతో..  రోడ్లు,  పరిశ్రమలు,  దీర్ఘకాలిక  మౌలిక  వసతుల కల్పనకు నిధులు కొరవడుతున్నాయి.  ఇది భవిష్యత్తు వృద్ధి  రేటును  దెబ్బతీస్తుంది.

ఆర్థిక క్రమశిక్షణను పణంగా పెడితే..

తెలంగాణ  ఆర్థిక వ్యవస్థ మూడు చక్రాల బండి లాంటిది. ఇందులో సేవా రంగం వేగంగా దూసుకుపోతున్నా,  పరిశ్రమలు,  వ్యవసాయ రంగాలు కూడా అదే వేగంతో పురోగమించాలి.  అప్పుడే  సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. సంక్షేమ పథకాలు సమాజంలోని  బలహీన వర్గాలకు  ఒక  భద్రతా వలయం లాంటివి.  వాటిని పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదు,  అది  శ్రేయోరాజ్య భావనకు విరుద్ధం.  కానీ, ఆర్థిక క్రమశిక్షణను పణంగా పెట్టి ఇచ్చే ఉచితాలు భవిష్యత్తు తరాన్ని అప్పుల పాలు చేస్తాయి.  తెలంగాణ ఆర్థికంగా మరింత దృఢపడాలంటే ‘సమతుల్యత’ అత్యంత ముఖ్యం.  

సంక్షేమాన్ని ఉత్పాదకతతో  ముడిపెట్టి,  మూడు రంగాలను సమాంతరంగా బలోపేతం చేసినప్పుడే తెలంగాణ  ఆర్థికవ్యవస్థ  ఎలాంటి  అంతర్జాతీయ లేదా జాతీయ ఆర్థిక మాంద్యాన్నైనా  తట్టుకుని  స్థిరంగా  నిలబడగలదు.  సంక్షేమం అనేది నిరుపేదను ఆర్థికంగా పైకి లేపే  నిచ్చెన కావాలి తప్ప, శాశ్వతంగా  ప్రభుత్వంపైనే ఆధారపడేలా చేసే  అలవాటు కాకూడదు.  ఇప్పటికైనా  పాలకులు  తాత్కాలిక  రాజకీయ  ప్రయోజనాలను  పక్కనబెట్టి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలతో ముందడుగు వేయాలని ఆశిద్దాం.

– డా. ఎండి ఖ్వాజా మొయినొద్దీన్
ఎకనామిక్, 
సోషల్​ ఎనలిస్ట్​

©️ VIL Media Pvt Ltd.