Reading Time: < 1 minute
Sanju Samson Compares Ms Dhoni To Roger Federer Virat Kohli To Carlos Alcaraz

Sanju Samson: వింబుల్డన్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లతో పోలుస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు క్రికెట్‌లో సమానమైన వ్యక్తి ఎవరంటే అది ఎంఎస్ ధోనీయేనని సంజూ శాంసన్ అన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆటను నడిపిస్తారని, ఆయన ఆటలో కనిపించే సౌలభ్యం, ప్రభావం ఫెడరర్‌ను గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. మరోవైపు యువ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చారు సంజూ… అల్కరాజ్ ఆటలో కనిపించే దూకుడు, శక్తి, పేలుడు స్వభావం కోహ్లీ కెరీర్ ప్రారంభ దశను గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రస్తుత ఛాంపియన్ జానిక్ సిన్నర్ నిలబెట్టుకుంటాడని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నా అంచనా వేశారు. మహిళల విభాగంలో 2022 ఛాంపియన్ ఎలెనా రైబాకినా టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వింబుల్డన్ తన చిన్ననాటి కల అని బోపన్నా పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి టెలివిజన్‌లో వింబుల్డన్ మాత్రమే ఎక్కువగా చూసేవాడినని, తర్వాత అదే కోర్టుల్లో ఆడే అవకాశం రావడం తన జీవితంలో మరపురాని అనుభవమని చెప్పారు. రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్, నోవాక్ జొకోవిచ్ వంటి టెన్నిస్ దిగ్గజాలతో ఒకే యుగంలో ఆడటం తనకు కల నిజమైనట్టేనని బోపన్నా గుర్తుచేసుకున్నారు.