
హైదరాబాద్, వెలుగు: టీజీ 20 లీగ్లో రెండో రోజే రెండు సెంచరీలు నమోదయ్యాయి. టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ (136 నాటౌట్) దుమ్మురేపడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో వరంగల్ వారియర్స్‌పై గెలిచింది.
అమన్ రావు పేరాల (142) సెంచరీ చేయడంతో ముందుగా వరంగల్ 20 ఓవర్లలో 258/7 స్కోరు చేసింది. హర్షిత్ చౌదరి (35), అభిషేక్ (32), రిషికేత్ (25) రాణించారు. తిలక్ వర్మ 2 వికెట్లు తీశాడు. తర్వాత మెదక్ 19.4 ఓవర్లలో 259/7 స్కోరు చేసింది. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ బోణీ చేసింది.
ఛేజింగ్‌లో త్యాగరాజన్ (71 నాటౌట్), జవాజీ (41) చెలరేగడంతో.. రంగారెడ్డి 5 వికెట్ల తేడాతో అనురాగ్ నల్గొండ నైట్స్‌పై గెలిచింది. ముందుగా నల్గొండ నైట్స్ 20 ఓవర్లలో 189/8 స్కోరు చేసింది. డి. సింగ్ (48), టి. సింగ్ (40 నాటౌట్), రాహుల్ బుద్ది (30) మెరుగ్గా ఆడారు. పున్నయ్య 3, కరియప్ప 2 వికెట్లు తీశారు.
తర్వాత రంగారెడ్డి రైజర్స్ 16.3 ఓవర్లలోనే 190/5 స్కోరు చేసి నెగ్గింది. అవినాష్ రావు (22), ఎన్. యాదవ్ (26 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.