
Story Board : కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్…నాలుగోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్రిశూల వ్యూహంతో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది. బీహార్, బెంగాల్‌లో అనుసరించిన ఫార్మూలానే…2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ ఎన్నికలదే కీలక పాత్ర. అలాంటప్పుడు ఓటర్ల విషయంలో వారి అర్హతలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవటం చాలా అవసరం. ఈ ఉద్దేశంతోనే సర్ ప్రక్రియకు రూపకల్పన జరిగింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది సర్ కాదు ఓట్ల చోరీ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈసీ మాత్రం అవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తోంది.
దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు సర్ నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఈసీ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు సర్ జరిగింది. కానీ, ప్రస్తుత సర్వే స్థాయిలో అవేవీ వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కొడిగట్టిన ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సర్ పేరిట జరుగుతున్న తతంగమంతా బీజేపీకి సానుకూలత, విపక్షాలకు ప్రతికూలత కల్పించేందుకేనని, అందుకు కృత్రిమమైనరీతిలో చేర్పులు, ప్రక్షాళనలు జరుగుతున్నాయని ప్రధానమైన ఆరోపణ. పనిలోపనిగా పౌరసత్వ పరీక్షలూ జరుగుతున్నాయనేది మరో ఆరోపణ.
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల సంఘం సర్వే చేపట్టింది. అందులోనూ మొదటి విడతగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించడంపై ఇప్పటికే తీవ్ర దుమారం చెలరేగింది. మార్పుల తర్వాత జాబితాలో 50 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతు కావడంపై పార్లమెంటు కూడా దద్దరిల్లింది. ఈ వివాదం ఒక కొలిక్కి రాకుండానే దేశమంతటా సర్ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ గత అక్టోబర్ 27న ప్రకటించింది. దీనిపై విపక్ష పాలిత రాష్ర్టాలు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిఘటించి తీరుతామని శపథం పూనాయి. కానీ తీవ్ర నిరసనల మధ్యే సర్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల్లో తమ ఓటమికి సర్ తోనే పునాది పడిందని బెంగాల్లో మమతా బెనర్జీ సుప్రీందాకా వెళ్లి మరీ ప్రతిఘటించారు. దీంతో సుప్రీంకోర్టు సర్ ప్రక్రియ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించింది. చివరకు వారిని కూడా ఘెరావ్ చేసే దుస్థితి రావడం, తమ ఆదేశాల్ని కూడా బెంగాల్ రాష్ట్ర యంత్రాంగం బేఖాతరు చేయడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర బలగాల రక్షణలో సర్ జరగాల్సిందేనని, సర్‌కు ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే చూస్తూ ఊరుకునేది లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సర్ నిబంధనల మేరకు జరగకపోతే ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు కానీ.. అసలు ప్రక్రియనే వద్దనడం పద్ధతి కాదని సర్వోన్నత న్యాయస్థానం పార్టీలకు తలంటింది.
ఉత్తరప్రదేశ్ సర్‌లో ఏకంగా సుమారు 20 శాతం ఓటర్ల పేర్లు, అంటే 2.89 కోట్ల ఓట్లు గల్లంతవడం కలకలం రేపింది. రాష్ట్రంలోని మొత్తం ఓట్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి 12.55 కోట్లకు తగ్గిపోయింది. ఇక రాజధాని లక్నోలో 39.9 లక్షల ఓట్లుంటే అందులో 30 శాతం సర్వేలో ఎగిరిపోయి చివరకు 27.9 లక్షలే మిగిలాయి. అందులో కొందరు ఓటర్లు చనిపోయారని, మరికొందరు వేరే ప్రాంతాలకు వలసపోయారని, ఇంకొందరి పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువచోట్ల ఉన్నాయని కమిషన్ వివరణ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ భారీ స్థాయిలో ఓట్ల తొలగింపుపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ కార్యక్రమం వల్ల ఓటర్లలో కొన్ని వర్గాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.
సర్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడు న్యాయపోరాటానికి దిగింది. ఎన్నికల సంఘం చేపట్టిన సవరణకు ఎలాంటి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదని, పారదర్శకత, సమన్యాయం లోపించాయని ఆరోపించింది. బెంగాల్‌లో ఏకంగా నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు సర్ యంత్రాంగం విచారణ నోటీసు పంపించడంపై వివాదం రేగింది. దేశ విభజన నుంచి బంగ్లా యుద్ధం దాకా అనేక చారిత్రక కారణాల వల్ల బెంగాల్‌లో పౌరసత్వ సమస్యలున్నాయి. సర్ పేరిట దొడ్డిదారిన సిటిజన్‌షిప్ రిజిష్టర్‌ను ప్రవేశపెడుతున్నారని టీఎంసీ మండిపడింది. ఈ వివాదాల వెనుక నిజానిజాల మాట అటుంచితే, ప్రజలకూ, పార్టీలకూ సర్‌పై అంతులేనన్ని అనుమానాలున్నాయన్న మాట నిజం. పార్టీలు ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘంపై కూడా నమ్మకం ఉంచటం లేదు. అయితే బెంగాల్ సర్ విషయంలో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని అడిగితే.. ఏ పార్టీ నుంచీ స్పందన రాలేదు. కనీసం తుది జాబితాపై అభ్యంతరాలు అడిగినా.. ఎవరూ ముందుకు రాలేదు. తగినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సర్‌ను రాజకీయ వివాదంగా మార్చొద్దని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ.. సర్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను పీసీసీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా 2-3 నెలల్లో హడావిడిగా ముగించకుండా, ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని సూచించింది. సర్‌లో ఓటు తొలగిస్తే దరఖాస్తు చేసుకోవడానికి గడువును 3 నెలలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే జనగణన ప్రక్రియ జరుగుతున్నందున దాంతోపాటే సర్ నిర్వహిస్తే.. సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళ కూడా ఉంది. బూత్ లెవెల్ అధికారులు ప్రత్యక్షంగా 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు తనిఖీ చేయాలి. విదేశీయులు ఉన్నారనే నెపంతో ఓట్లు తొలగించే ప్రక్రియ సరికాదనే సూచనలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ముస్లిం ఓటర్లు, ఏపీ ఓటర్ల పేర్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటిదాకా సర్ జరిగిన రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాల్ని బట్టి.. పాతబస్తీలో ముస్లిం ఓట్లను గంపగుత్తగా తొలగించి.. పౌరసత్వ నిరూపణ అడుగుతారేమోననే భయాలు లేకపోలేదు. అలాగే ఏపీ ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తే.. జీహెచ్ఎంసీలో చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయనే భయం అన్ని పార్టీల్లోనూ ఉంది. ఉదాహరణకు బెంగాల్‌లో సర్ కారణంగా టీఎంసీతో పాటు అనూహ్యంగా బీజేపీకీ నష్టం తప్పలేదు. ఇక్కడ కూడా సర్ పూర్తయ్యాక.. ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో తేలుతుందని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ని పార్టీలూ.. సర్ విషయంలో ముందస్తు సన్నద్ధతను పూర్తిచేసినా.. చివరకు ఏమౌతుందోననే టెన్షన్ మాత్రం అందరికీ తప్పటం లేదు. సర్ ప్రక్రియలో ఏ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు తెరపైకి వస్తాయి..? ఓటర్ల విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? పార్టీల అభ్యంతరాలకు ఏ మేరకు విలువ ఇస్తారు..? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా సర్ జరుగుతుందేమోనని ప్రతిపక్షాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. తుది జాబితాలు వెల్లడయ్యాకే.. అసలు విషయ తెలుస్తుందని, అందాకా ఓపిక పట్టాలని కాషాయ పార్టీ కౌంటరిస్తోంది. మరోవైపు తమను ఏం డాక్యుమెంట్లు అడుగుతారోనని కొందరు ఓటర్లు కూడా కంగారు పడుతున్నారు.
ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం సర్ అవసరమే అనే వాదనతో అన్ని పార్టీలూ ఏకీభవిస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియకు ఎంచుకుంటున్న సమయం, సందర్భంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇక్కడ అవకతవకలు ఉన్నాయా.. లేదా అనేది పక్కనపెడితే.. అసలు అనుమానాలు కలిగేలా ఎందుకు వ్యవహరించాలనే ప్రశ్నకు మాత్రం కచ్చితంగా జవాబు వెతకాల్సిందే. అటు పార్టీలు,ఇటు ఓటర్లు అందరిలోనూ నమ్మకం కలిగించే విధంగా ఈసీ విధానాలకు పదునుపెట్టాలనే సలహాలు వస్తున్నాయి. అనవసర ఆందోళనలు, వివాదాలకు తావివ్వకుండా.. ఎవ్వరూ వేలెత్తిచూపటానికి వీల్లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో సర్ జరగాలనే భావన వ్యక్తమవుతోంది. అయితే మన దగ్గర బీహార్, బెంగాల్ మాదిరి రగడకు ఆస్కారం లేదని, ఇక్కడ చాలావరకు ఓటర్లకు సరైన పత్రాలుంటాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.